మీకు ఈఫిల్ టవర్, తాజ్‌మహల్ తెలుసు. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన వీటి కన్నా ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించిన కట్టడం ఒకటి మన దేశంలోనే ఉందని తెలుసా? అదే ఢిల్లీలోని లోటస్ టెంపుల్. కలువ పువ్వు ఆకారంలో కట్టిన ఆలయమన్నమాట. దీన్ని నిర్మించి పాతికేళ్లు అయిన సందర్భంగా అక్కడ ఉత్సవాలు జరగనున్నాయి. ఇప్పటి వరకూ దీన్ని ఏకంగా 7 కోట్ల మంది సందర్శించారు. అద్భుత పాలరాతి కట్టడంగా ఇది గిన్నిస్ పుస్తకంలోకి కూడా ఎక్కింది. పెద్ద కలువ పువ్వులా కనిపించే ఈ ఆలయం ఎత్తు 131 అడుగులు! అంటే దాదాపు పన్నెండు అంతస్తుల భవనమంత అన్నమాట! ఏటా 40 లక్షల మంది, రోజుకి 13 వేలమంది, నిముషానికి 9 మంది దీన్ని చూస్తున్నారని అంచనా.
ప్రపంచ దేశాలన్నీ దీని నిర్మాణాన్ని అపురూపమైనదిగా గుర్తించాయి. ఉత్తర అమెరికా ఇంజినీరింగ్ సంఘం 20వ శతాబ్దపు తాజ్‌మహల్‌గా బిరుదిచ్చింది. తాజ్‌మహల్‌లాగే దీన్ని కూడా పాలరాతితోనే కట్టారు. ఇందుకోసం గ్రీస్ నుంచి ప్రత్యేకంగా పాలరాయిని దిగుమతి చేసుకున్నారు. మొత్తం 27 రేకులతో కూడిన కలువ ఆకారంలో కట్టిన ఇది చుట్టూ ఏర్పరిచిన జలాశయాల మధ్య నీటిలో తేలియాడుతున్నట్టు ఎంతో అందంగా కనిపిస్తుంది. మొత్తం 26 ఎకరాల స్థలంలో తీర్చిదిద్దిన దీని నిర్మాణం ఆరేళ్లపాటు కొనసాగి 1986లో పూర్తయింది. తొమ్మిది ద్వారాలతో కనిపించే ఈ ఆలయం లోపల 2500 మంది కూర్చోగలిగినంత విశాలమైన ధ్యానమందిరం ఉంటుంది. దీన్ని నిర్మించిన ఇరానీ శిల్పకారుడు ఫరీబోజ్ సహ్‌బా దేశదేశాల్లో ఎన్నో పురస్కారాలు పొందిన ప్రఖ్యాత శిల్పకారుడు.
ఇంతకీ ఈ ఆలయంలో ఏ దేవుడుంటాడు? ఎవరూ ఉండరు! ఇది బహాయి మతానికి చెందినది. వారి సిద్ధాంతం ప్రకారం దేవుడు నిరాకారుడు. 150 ఏళ్ల క్రితం ఆవిర్భవించిన ఈ మతాన్ని ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 లక్షల మంది అనుసరిస్తారు. ఏ మతాన్ని అవలంబించేవారైనా ఇక్కడకు వచ్చి ధ్యానం చేసుకోవచ్చు.
- ============================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...