ప్రశ్న: మంటల నుంచి వెలువడే పొగ వేర్వేరు రంగుల్లో ఎందుకుంటుంది?
-పి. కేశవ్, ఇంటర్, తాడిపత్రి (అనంతపురం)
జవాబు: మంటల నుంచి వెలువడే పొగలో వేడిగాలులు, అనేక చిన్న కణాలు, సూక్ష్మమైన నీటి తుంపరలు కలగలిసి ఉంటాయి. మండుతున్న పదార్థాలు, మంట ఉష్ణోగ్రతలపై పొగ రంగు ఆధారపడి ఉంటుంది. దట్టమైన నల్లటి పొగలో ఎక్కువ పరిమాణంలో మసి కణాలుంటాయి. ఈ పొగ ఖనిజ తైలం లేదా కర్బన సంబంధిత పదార్థాలు తక్కువ ఉష్ణోగ్రతలో మండుతున్నప్పుడు ఏర్పడుతుంది. అందులోని మసికణాలు వాటిపై పడే కాంతిని శోషించుకోవడం వల్ల పొగ నల్లగా కనిపిస్తుంది. తక్కువ ఉష్ణోగ్రత కలిగిన మంటలో పొగాకు వంటి తడి ఇంధనం మండేప్పుడు కర్బన కణాలు, బూడిద, నీటి ఆవిరి వెలువడతాయి. ఆ కణాలపై పడే కాంతి పరావర్తనం చెందడం వల్ల ఆ పొగ తెల్లగా కనిపిస్తుంది.
అగ్నిమాపక దళం వారు పొగరంగు, పరిమాణాలను బట్టి మండుతున్న పదార్థాలను గుర్తించగలిగే శిక్షణ పొందుతారు. ఉదాహరణకు ఫర్నిచర్ మండుతున్నప్పుడు వెలువడే పొగ బూడిద రంగులో ఉంటుంది. అందులో ప్లాస్టిక్ ఎక్కువగా ఉంటే పొగ నల్లగా ఉంటుంది. పొగ పసుపు లేదా గోధుమ రంగులో కనిపిస్తే దానర్థం మంటకు సరిగా ఆక్సిజన్ అందడం లేదని, మండే పదార్థాల్లో హైడ్రోకార్బన్లు పూర్తిగా మండడం లేదని అర్థం. ఇలాంటి పొగ వెలువడుతున్న గదులను తటాలున తెరిస్తే వాతావరణంలోని ఆక్సిజన్ అంది మంటలు పెరిగి పేలుడు కూడా సంభవించే అవకాశాలు ఉంటాయి. రసాయనిక పదార్థాలు మండుతున్నప్పుడు వచ్చే పొగ ఆకుపచ్చ లేదా ఎరుపు రంగులో ఉంటుంది.
-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- =====================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...