Friday, June 10, 2011

అయస్కాంతాలు ఇనుమును మాత్రమే ఆకర్షిస్తాయెందుకు?, Why do Magnets attracts iron only?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ప్రశ్న: అయస్కాంతాలు ఇనుమును మాత్రమే ఆకర్షిస్తాయెందుకు?, Why do Magnets attracts iron only?

-జి.ఆర్‌. వాసవి, రొద్దం (అనంతపురం)

జవాబు: బాహ్య అయస్కాంతాల పట్ల ప్రవర్తించే తీరును బట్టి పదార్థాలను మూడు తరగతులుగా విభిజిస్తారు.
అవి 1. డయాస్కాంత(dia-magnetic), 2. పరాయాస్కాంత (paramagnetic), 3. ఫెర్రో అయస్కాంత పదార్థాలు. డయాస్కాంత పదార్థాలను బాహ్య అయస్కాంతం వికర్షిస్తుంది. అయితే ఈ వికర్షణ బలం చాలా స్వల్పం కాబట్టి మనం గుర్తించలేక ఆకర్షించడం లేదనే భావిస్తాము. నీరు, రబ్బరు, చక్కెర, ఉప్పు వంటివి ఇందుకు ఉదాహరణలు. ఇక పరాయాస్కాంత పదార్థాలను బాహ్య అయస్కాంతం స్వల్పంగా ఆకర్షిస్తుంది. అయితే ఈ ఆకర్షణ బలం కూడా అతి స్వల్పంగా ఉండడంతో మనం వాటిని కూడా అయస్కాంతం ఆకర్షించదనే అనుకుంటాము. ఇందుకు ఉదాహరణ రక్తం, మైలతుత్తం, కొబాల్టు క్లోరైడు, ఆక్సిజన్‌, మాంగనీస్‌ సల్ఫేటు మొదలైనవి. ఇక మూడో రకమైన ఫెర్రో అయస్కాంత పదార్థాలను మాత్రమే అయస్కాంతం బలీయంగా ఆకర్షిస్తుంది. వీటిలో కేవలం ఇనుమే కాదు, క్రోమియం ఆక్సైడు, క్రోమియం, నికెల్‌ లోహాలు కూడా ఉన్నాయి. పదార్థాలలో ఒంటరి ఎలక్ట్రాన్లు ఏమాత్రం లేకుండా అన్నీ జతలుగా ఉంటే అవి డయాస్కాంత ధర్మాలను ప్రదర్శిస్తాయి. అణువుకో, పరమాణువుకో ఒకటో, రెండో జతకూడని ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్న పదార్థాలు పరాయాస్కాంత ధర్మాలను ప్రదర్శిస్తాయి. చాలా ఎక్కువ సంఖ్యలో ఒంటరి ఎలక్ట్రాన్లు ఉండడమే కాకుండా అవన్నీ కవాతు చేసే సైనికుల్లా ఒకే దిశలోకి మళ్లగలిగే పదార్థాలు ఫెర్రో అయస్కాంత పదార్థాలు అవుతాయి.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

  • =================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...