ప్రశ్న: అప్పుడప్పుడు ఫ్యూజ్ పోయి విద్యుత్ ఆగిపోతూ ఉంటుంది కదా? అసలు ఇది ఎందుకు ఉండాలి?
-కె. ఉషారాణి, విజయనగరం
జవాబు: విద్యుత్‌తో పనిచేసే రిఫ్రిజిరేటర్, టీవీ, ఏసీలాంటి పరికరాల గుండా విద్యుత్ ప్రవాహం తీవ్రత ఎక్కువైతే అవి పాడయ్యే ప్రమాదం ఏర్పడుతుంది. ఒకోసారి ఇళ్లలో అగ్ని ప్రమాదాలు కూడా సంభవిస్తాయి. ఇలా జరగకుండా నిరోధించడానికి ఏర్పాటు చేసేవే ఫ్యూజ్‌లు. విద్యుత్ సరఫరా కేంద్రం నుంచి మన ఇంటిలోపలి వరకూ వివిధ దశల్లో వీటిని అమరుస్తారు. విద్యుత్ ప్రవాహం అవసరానికి మించి ఎక్కువగా సరఫరా అయ్యే సందర్భాలలో ఫ్యూజ్‌లలో అమర్చే తీగ చటుక్కున కరిగిపోయి విద్యుత్ ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది. సాధారణంగా ఫ్యూజ్ తీగలను కొన్ని లోహాల మిశ్రమంతో చేస్తారు. దీని ద్రవీభవన స్థానం (melting point) తక్కువగా ఉంటుంది కాబట్టి, విద్యుత్ ప్రవాహ తీవ్రత పెరిగినప్పుడు ఫ్యూజ్ తీగ వేడెక్కి కరిగిపోతుంది. అందువల్ల విద్యుత్ ప్రవాహం ఆగిపోయి ప్రమాదాలు తప్పుతాయి. చాలా మంది ఫ్యూజ్ తరచు పోకుండా ఉండడానికి అందులో రాగి తీగలను మెలిపెట్టి వాడుతుంటారు. ఇది ప్రమాదాలను కొని తెచ్చుకోవడమే కాగలదు.
-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- ===============================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...