ఫ్ర : ప్రపంచంలోనే అతి పెద్ద గ్రంథాలయం ఏది?,ఎక్కడ,Where is the Biggest Library in the world?
జ :
పది కోట్ల పుస్తకాల గ్రంథాలయం 211 ఏళ్ల చరిత్ర... 10 కోట్ల పుస్తకాలు... 3 వేల మందికి పైగా సిబ్బంది... అన్నీ కలిస్తే... ప్రపంచంలోనే అతి పెద్ద గ్రంథాలయం!
మీరు అప్పుడప్పుడు గ్రంథాలయానికెళ్లి పుస్తకాలు చదువుకుంటారుగా? మరైతే ప్రపంచంలోనే అతి పెద్ద లైబ్రరీ ఎక్కడుందో తెలుసా? అమెరికా రాజధాని వాషింగ్‌టన్ డీసీలో. అమెరికా ప్రభుత్వం దీన్ని కేవలం 5000 డాలర్లతో 1800లో ప్రారంభించింది. అంటే దీనికి ఏకంగా 211 ఏళ్ల చరిత్ర ఉందన్నమాట. లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్‌గా పిలిచే దీంట్లో మొత్తం 14 కోట్ల వస్తువులు ఉన్నాయి. అంటే పుస్తకాలతోపాటు సీడీలు, పురాతన పత్రాలు, మ్యాపులూ, వీడియోలు ఇలాంటివన్నమాట. కేవలం పుస్తకాల సంఖ్యే 10,90,29,769. ఈ పుస్తకాలన్నీ ఎంత స్థలాన్ని ఆక్రమిస్తాయో తెలుసా? వీటిని పేర్చిన అరలన్నీ కలిపితే 1046 కిలోమీటర్ల పొడవుంటాయి. గ్రంథాలయం నిర్వహణకు 3,597 మంది సిబ్బంది పనిచేస్తారు. అతి పెద్ద లైబ్రరీగా గిన్నిస్ రికార్డు కూడా పొందిన దీనికి www.loc.gov అనే వెబ్‌సైట్ ఉంది.
దీన్ని ప్రారంభించి పన్నెండేళ్లయిందో లేదో అమెరికాపై యుద్ధానికి దిగిన బ్రిటిష్ సేనలు దీంట్లోని విలువైన పుస్తకాలను ఎత్తుకెళ్లి గ్రంథాలయానికి నిప్పుబెట్టారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు థామస్ జెఫర్‌సన్ తాను సేకరించిన 6000 పుస్తకాలతో మళ్లీ దీన్ని ప్రారంభించారు. తర్వాత క్రమంగా పుస్తకాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇప్పుడిది అత్యాధునిక సౌకర్యాలతో, కంప్యూటర్ పరిజ్ఞానంతో మూడు విశాలమైన భవనాల్లో కొలువుదీరింది.
అన్ని రంగాల సమాచారాలతో సిద్ధంగా ఉండే ఇది అమెరికా ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తుంది. అమెరికా కాపీరైట్ సంస్థగా కూడా పనిచేస్తుంది. ఎలాంటి సమచారం కావాలన్నా క్షణాల్లో దొరుకుతుంది. విభిన్న రంగాల పరిశోధనలకు కావాల్సిన విలువైన సమాచారం లభిస్తుంది. ప్రభుత్వానికి సమాచారం అందించే సంస్థగా కూడా పనిచేస్తుంది.
మీకు తెలుసా?
* 470 భాషల పుస్తకాలు ఈ లైబ్రరీలో ఉన్నాయి.
* 526,378 కాపీరైట్‌లు నమోదయ్యాయి.
* పాఠకుల కోసం 20 విశాలమైన గదులున్నాయి.
* సదస్సుల నిర్వహణకు అయిదు వేదికలు ఉన్నాయి.
* సినిమా ప్రదర్శనల కోసం ఒక థియేటర్ ఉంది
- ==========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...