ప్రశ్న: వృత్తాన్ని ఎందుకు 360 డిగ్రీలుగా విభజించారు?
-కె. రమణారావు, 10వ తరగతి, కోరుకొండ
జవాబు: ప్రస్తుత కాలంలో మనం దశాంశ పద్ధతి (Decimal System)ను వాడుతున్నట్టే, బాబిలోనియన్లు 3000 సంవత్సరాల క్రితం షష్టిగుణక పద్ధతి (hexagesimal system)ను అనుసరించేవారు. ఈ పద్ధతిలో గణిత సంబంధిత సంఖ్యలన్నీ 6 చేత గుణించబడి ఉండాలి. ఆ ప్రకారం సంవత్సర కాలాన్ని 360 రోజులుగా, రోజును 24 గంటలుగా, రోజులోని గంటను 60 నిమిషాలుగా, నిమిషాన్ని 60 సెకన్లుగా, నెలను 30 రోజులుగా, సంవత్సరాన్ని 12 నెలలుగా విభజించారు. రాశి చక్రం సంజ్ఞలు కూడా పన్నెండే. ఇవన్నీ 6 గుణకాలే.
బాబిలోనియన్ల అంచనా ప్రకారం భూమి, గ్రహమండలం (zodiac)గుండా 360 రోజులు వృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తుంది. అందువల్ల వృత్తాకారాన్ని 360 భాగాలుగా విభజించారు. ఒక్కో భాగం ఒక డిగ్రీ. అంటే భూమి గ్రహమండలంలో ఒక రోజుకు ఒక డిగ్రీ వంతున పరిభ్రమిస్తుంది. 60X6=360 కాబట్టి ఒకో డిగ్రీని 60 భాగాలుగా (ఒకో భాగం మినిట్), ఒక మినిట్‌ను 60 భాగాలుగా (ఒకో భాగం సెకండు)గా విభజించారు. త్రికోణమితిలో తరచూ ఉపయోగించే కోణీయ రూపకాలైన డిగ్రీలన్నీ ఆరు గుణకాలే. ప్రాథమిక భౌతిక రాశులైన పొడవు, ద్రవ్యరాశులు చాలా కాలం కిందటే దశాంశ పద్ధతి (మెట్రిక్)లోకి మార్పు చెందినా, ఇప్పటికీ కాలం (టైమ్) కొలతలు మాత్రం షష్టిగుణక పద్ధతిలోనే కొనసాగుతున్నాయి.
-ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- ===================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...