Tuesday, February 08, 2011

ఆ వేగుచుక్కలు ఏమిటి? , What are those bright morning stars?



ప్రశ్న: తెల్లవారుతున్నప్పుడు తూర్పు దిశలోను, సాయంత్రం వేళల్లో పడమర దిశలోను ప్రకాశవంతమైన నక్షత్రాలు కనిపిస్తాయి. అవేంటి?
-పి. సుధాకర్‌, మదనపల్లి (చిత్తూరు)
జవాబు: తెల్లవారుతుండగా తూర్పున, సాయంత్రం పడమర దిక్కున కనిపించే నక్షత్రం ఒక్కటే. వేర్వేరు కావు. నిజానికి అది నక్షత్రం కాదు. అది శుక్రగ్రహం (వీనస్‌). అందమైన ఉజ్వలమైన కాంతిని వెలువరించడం వల్ల ఈ గ్రహానికి రోమన్‌ ప్రేమదేవత 'వీనస్‌' పేరును పెట్టారు. ఇంతటి వెలుగుకు కారణం ఈ నిర్జీవ గ్రహంపై ఉండే ప్రమాదకరమైన యాసిడ్‌ మేఘాలే. ఇవి సూర్యకాంతిని ఎక్కువగా పరావర్తనం చెందిస్తాయి. ఎంత ఎక్కువగా అంటే మనకి సూర్యుడు, చంద్రుడు తర్వాత ప్రకాశవంతంగా కనిపించేది శుక్రుడే. శుక్రుడు పరిభ్రమించే కక్ష్య భూకక్ష్య లోపల ఉంటుంది. అందువల్లనే మనం ఆకాశం వైపు చూసినప్పుడు సూర్యుడు, శుక్రగ్రహం వ్యతిరేక దిశల్లో ఉండకపోవడమే కాకుండా అర్థరాత్రివేళ అది కనిపించదు. తెల్లవారుతున్నప్పుడు, సాయం సమయాల్లో మాత్రమే కనిపిస్తుంది. అలాగే శుక్రగ్రహం సాయం వేళల్లో అస్తమించదు. తెల్లవారుజామున ఉదయించదు. సూర్యుడు ఉదయించినప్పుడు తూర్పు దిశలో, సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు పశ్చిమ దిశలో మాత్రమే కనిపిస్తుంది. ఉదయాన్నే కనిపించే శుక్రగ్రహాన్ని నక్షత్రంగా భావించడం వల్లనే దానిని 'వేగుచుక్క' అని వ్యవహరిస్తుంటారు.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌


  • ==================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...