ప్రశ్న: టీవీ తెరను దగ్గరగా చూడకూడదంటారు. కంప్యూటర్‌ని మాత్రం దగ్గరగానే చూస్తారు. ఈ రెండు తెరల్లో తేడాలున్నాయా?
-కె.ఎన్. మౌనిక, సెయింట్ అగస్టిన్ పాఠశాల, అమరావతి
జవాబు: ఈమధ్య వస్తున్న LED(Light Emitting Diode),LCD (Liquid Crystal Display) తెరల (మానిటర్ల) విషయాన్ని వదిలేస్తే, కేవలం CRT (Cathode Ray Tube) తెరల విషయంలోనే ఈ ప్రశ్న తలెత్తుతుంది.
టీవీల్లో ఉండే ఈ తెరల వైశాల్యంతో పాటు శక్తి స్థాయి కూడా కంప్యూటర్లతో పోలిస్తే ఎక్కువ. సీఆర్‌టీ తెరల వెనుక భాగమంతా ఓ గాజు బల్బులాగా ఉంటుంది. దానికి వెనుక భాగాన ఎలక్ట్రాన్లను విడుదల చేసే ఫిలమెంట్ (కాథోడ్) ఉంటుంది. రంగు మానిటర్లలో ఇలాంటివి మూడు ఉంటాయి. వీటి దగ్గర విడుదలయ్యే ఎలక్ట్రాన్లు మనకి కనిపించే తెర వెనుక భాగం మీద పడుతుంటాయి. ఆ ఎలక్ట్రాన్లు ఆ భాగంలో పూత పూసిన ఫ్లోరోసెంట్ పదార్థం పడడం వల్ల కాంతి వెలువడుతుంది. ఆ కాంతి వ్యత్యాసాలే తెర ఇవతలకి దృశ్యాలుగా కనిపిస్తాయి. టీవీ ఎక్కువ మంది చూడ్డానికి ఉద్దేశించినది కాబట్టి వాటిలో ఎలక్ట్రాన్లు తీవ్ర శక్తితో తెర వెనుకభాగాన్ని ఢీకొంటాయి. అప్పుడు కొంత అతినీలలోహిత కిరణాలు (ultraviolet rays) విడుదలవుతాయి. అందువల్ల దూరం నుంచి చూడ్డం మంచిది. కంప్యూటర్‌లో ఎలక్ట్రాన్లు తక్కువ వేగంతో వస్తాయి కాబట్టి ప్రమాదం ఉండదు.
-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- ============================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...