చెక్కల్ని కోసే రంపం తెలుసుగా? పదునైన పళ్లతో కసాకసా కోసేస్తుంది. అచ్చం అలాంటి ముక్కుతో ఉండే చేపే 'సా ఫిష్' (saw fish). రంపానికి ఒకవైపే పళ్లుంటే, దీని ముక్కుకి మాత్రం రెండు వైపులా పదునే. అటూ ఇటూ కలిసి దాదాపు 35 కొనదేలిన పళ్లు ఉంటాయి. ఎంత పదునైన ముక్కుంటేనేం? పాపం... ఇవి ఇప్పుడు ప్రమాద పరిస్థితిలో పడ్డాయి. త్వరలో అంతరించిపోయే జీవుల జాబితాలో చేరాయి. అందుకే ఆస్ట్రేలియా, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో వీటిని పరిరక్షించే చర్యలు చేపట్టారు.
ఇంతకీ దీనికెందుకింత ముక్కు? ఇది దానికెంతో ఉపయోగపడుతుంది. ముక్కుపై చిన్న చిన్న సూక్ష్మ రంధ్రాలుంటాయి. అవి విద్యుత్ తరంగాల ఆధారంగా చిన్న శబ్దాల్ని కూడా గ్రహిస్తాయి. సముద్రపు అడుగున ఇసుకలో దాక్కుని ఉన్న ప్రాణి గుండె కొట్టుకునే శబ్దాన్ని కూడా ఇది పసిగట్టేస్తుంది. దీని కంటిచూపు అంతంత మాత్రమే. అంటే ముక్కే దానికి దారి చూపిస్తుందన్న మాట. దాక్కుని ఉన్న ఆహారాన్ని ముక్కుతోనే తవ్వి తింటుంది. ఏ శత్రుజీవో దాడికి దిగితే ముక్కుతోనే పోరాడుతుంది.
వీటిల్లో 7 రకాల జాతులున్నాయి. అన్నింటి కంటే చిన్నది సుమారు 5 అడుగులు పెరిగితే పెద్దవి 23 అడుగుల పొడవు వరకు ఉంటాయి. సుమారు 2వేల కిలోల బరువు తూగుతాయివి. ఓ ఆంగ్ల రచయిత 1927లో 31 అడుగుల పొడవున్న సా ఫిష్‌ని చూసినట్లు ఒక పుస్తకంలో రాశాడు. అట్లాంటిక్, ఇండో-పసిఫిక్ సముద్రాలలో కనిపించే ఇవి పగలంతా నీటి అడుగున రాళ్ల మధ్య పడుకుని రాత్రుళ్లు వేటకి బయల్దేరతాయి.
సుమారు 30 ఏళ్ల పాటు బతికే వీటిని అధికంగా వేటాడేయడం వల్ల వీటి సంఖ్య తగ్గిపోతోంది. రంపం ముక్కు, మొప్పలు, ఊపిరితిత్తుల కోసం దీన్ని వేటాడుతున్నారు. వీటి మొప్పల్ని చాలా ఖరీదైన ఆహారంగా తింటారు. ఊపిరితిత్తుల నుంచి తీసే నూనెను మందుల తయారీలో వాడతారు. కొందరైతే వీటి ముక్కుల్ని కోసేసి మళ్లీ సముద్రంలో వదిలేస్తారు.
- ============================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...