Saturday, September 25, 2010

ఆవిరి కావడంలో తేడాలేల , Differences in Evaporation Why?



ప్రశ్న: గాలిలో పెట్రోలు త్వరగా ఆవిరైపోతుంది. నీరు అంత త్వరగా ఆవిరి కాదు. ఎందుకని?

-సాయి కిరణ్‌, చౌహాన్‌, శ్రీవాగ్దేవి ఉన్నత పాఠశాల, నిర్మల్‌

జవాబు: ఏదైనా ఒక ద్రవం ఆవిరయ్యే సమయం దాని అంతర్గత అణునిర్మాణం, పరిసరాల పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ద్రవాల్లో అణువుల మధ్య ఉండే బంధాల బలాలు, అణువుల ద్రవ్యరాశి కూడా ప్రభావం చూపిస్తాయి. అణువుల మధ్య బంధం ఎంత బలంగా ఉంటే ఆ ద్రవం అంత స్థిరంగా ఆవిరి కాకుండా ఉంటుంది. అసలు ఆవిరి కావడం అంటే అణువులు తమ మధ్య ఉండే బంధాలు తెంచుకుని స్వేచ్ఛగా వాతావరణంలో కలవడమే. అలాగే అణువుల ద్రవ్యరాశి ఎంత తక్కువ ఉంటే అంత తొందరగా ఆవిరవుతాయి. ఇప్పుడు నీటి విషయానికి వస్తే అణువుల మధ్య ఉండే బంధ బలం ఎక్కువ. కానీ పెట్రోలు అణువుల మధ్య బంధాలు బలహీనంగా ఉంటాయి. పెట్రోలు అణువుల భారం కన్నా, నీటి అణువుల భారం తక్కువే అయినా ఇక్కడ బంధ బలమే ప్రభావం చూపుతుంది. అలాగే పరిసరాల్లోని వాతావరణ పీడనం, ఉష్ణోగ్రత కూడా ద్రవాలు ఆవిరయ్యే వేగాన్ని, తీరును ప్రభావితం చేస్తాయి. పెట్రోలు సాధారణ గది ఉష్ణోగ్రత వద్దే ఆవిరయిపోతుంది.

-ప్రొ||ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక


  • =====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...