ప్రశ్న: ఒక వయసు వచ్చేప్పటికి మనిషి బరువు స్థిరంగా ఉండడానికి కారణం ఏమిటి?
జవాబు: ఒక వయసు వచ్చేసరికి పెరుగుదల ఆగుతుంది కానీ బరువు స్థిరంగా ఉంటుందన్న నియమం ఏదీ లేదు. పెరుగుదల అంటే అర్థం జీవకణాల సంఖ్య. తల్లి గర్భంలో ఏక కణంగా జీవం పోసుకున్న శిశువు తొమ్మిది నెలలు నిండేసరికి కొన్ని కోట్ల కణాలతో, పూర్తి అవయవాలతో, కండర కణజాలంతో పుడుతుంది. ఆపై ఎదిగే క్రమంలో ఎముకలు, చర్మం, పేగులు, కండరాల లాంటి భాగాలకు సంబంధించిన కణాల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. అందువల్ల పుట్టినప్పుడు సుమారు 2 అడుగుల పొడవుంటే, యవ్వన దశకు చేరుకునేప్పటికి సుమారు అయిదున్నర అడుగులకు ఎదుగుతారు. అలాగే పుట్టినప్పుడు సుమారు 4 కిలోల బరువుంటే, ఎదిగే క్రమంలో సుమారు 60 కిలోల వరకు చేరుకుంటారు. సాధారణంగా 18, 19 ఏళ్ల వయసు వచ్చేనాటికి గరిష్ఠ సంఖ్యలోకి కణాలు చేరుకుంటాయి. అందువల్ల ఆపై ఎదుగుదల ఆగిపోతుందని అంటారు. అయితే బరువు విషయం అలా కాదు. చిన్నప్పటి నుంచీ ఆటలాడకుండా అదేపనిగా తింటూ ఉంటే యవ్వనం నాటికే వంద కిలోల బరువు మించేవాళ్లు ఉంటారు. అలాగే 30 ఏళ్ల వరకూ నాజూగ్గా ఉన్నా ఆ తర్వాత వ్యాయామం, ఆహారపు అలవాట్లు సరిగా పాటించకపోవడం వల్ల ఊబకాయం వచ్చే వారూ ఉంటారు. అయితే ఈ అదనపు బరువు కణజాలాల వల్ల కాదు. కేవలం కణాల పరిమాణం (అందులో నీరు ఎక్కువ ఉండడం వల్ల), కణాల మధ్య కొవ్వు పెరగడం వల్ల కావచ్చు. చనిపోయేవరకూ కూడా బరువు పెరిగేవారున్నారు. కానీ యవ్వన దశ తర్వాత ఎదిగేవారు సాధారణంగా ఉండరు.
-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- =================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...