దోసిలిలో ఒదిగే అందమైన కలువ పువ్వుల్ని చూశాం. మరి ఏకంగా 91 అడుగుల పొడవుండే కలవపువ్వు గురించి తెలుసా? చూడాలనుకుంటే కేరళ వెళ్లాల్సిందే. అసలేంటా కలువపువ్వు? తెలుసుకుందాం రండి.
ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్‌మహల్, ఈజిప్టులోని పిరమిడ్‌లు, ఢిల్లీలో అందమైన ఉద్యానవనం మధ్యలో ఉన్న హూమయూన్ టూంబ్ ఇవన్నీ ఎవరో ఒకరి స్మారక నిర్మాణాలే. ఇలా చక్కని కట్టడాలని ఆప్తుల కోసం కట్టించడం మనకు తెలిసిందే. అలాగే కేరళలోని తిరువనంతపురంలో కూడా ఓ స్వామిజీ మీద ప్రేమతో ఆయన శిష్యులు ఓ అద్భుతమైన కట్టడాన్ని నిర్మించారు. పెద్ద కలువ పువ్వు ఆకారంలో ఉన్న ఇది మ్యూజియం కూడా. ప్రపంచంలో ఉన్న అతి పెద్ద స్మారక భవనాల్లో ఒకటిగా పేరు తెచ్చుకోనుంది. కొన్ని కిలో మీటర్ల దూరం నుంచి కూడా ఇది కనిపిస్తుంది. దీనిని ఈ రోజే మన రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ ప్రారంభిస్తున్నారు.
రాజస్థాన్ నుంచి ప్రత్యేకంగా తీసుకు వచ్చిన చలువరాయితో దీన్ని నిర్మించారు. సుమారు లక్ష చదరపు అడుగుల చలువరాయిని ఉపయోగించారని అంచనా. ఈ కలువ పువ్వు ఎత్తు 91 అడుగులు, వెడల్పు 84 అడుగులు. లోపలి భాగంలో 12 గదులు ఉంటాయి. అందులో స్వామీజీ వాడిన వస్తువులను భద్రపరిచారు. కలువ పువ్వుకి ఉండే 21 రేకుల్లో, 12 పైకి ఉంటే, 9 పూర్తిగా కిందికి ఉంటాయి. పైకి ఉండే ఒకో రేకు పొడవు 41 అడుగులు ఉంటే, కిందికి ఉండేవి 31 అడుగుల పొడవుతో ఉంటాయి. దీనిని నిర్మించడానికి మొత్తం 50 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. అందులో లోపల నిర్మించిన ప్రత్యేకమైన గదులకి, వస్తువులకే 20 కోట్ల రూపాయలు ఖర్చయినట్టు అంచనా. దీని లోపల 27 అడుగుల ఎత్తులో పై కప్పు ఉంటుంది.
దీన్ని ఎవరికోసం కట్టారో ఆ స్వామిజీ కరుణాకర గురూ చరిత్ర కూడా ఆసక్తికరమే. వెనుకబడిన కులంలో పుట్టి 42 ఏళ్ల వయసు వరకు వంటవాడిగా పనిచేసిన ఆయన ఆ తర్వాత స్వామీజీగా గుర్తింపు పొందారు. తిరువనంతపురంలోని పోతెన్‌కోడ్ గ్రామంలో 1968లో శాంతిగిరి ఆశ్రమాన్ని స్థాపించారు. అందులోకి కుల, మత భేదాలు లేకుండా అందరినీ ఆహ్వానించారు. ఆశ్రమంలో పర్ణశాలగా పిలుచుకునే చిన్న గుడిసెలో ఆయన అధిక సమయం ధ్యానంలోనే గడిపేవారు. స్వామిజీ నిరాడంబర జీవితానికి ప్రభావితులైన మాజీ రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ తన ఇంటిని ఆశ్రమానికి విరాళంగా కూడా ఇచ్చారు. 1999లో స్వామిజీ పరమపదించగా ఆయన శిష్యులు పర్ణశాల స్థలంలో స్మారక భవనాన్ని నిర్మించాలని తలపెట్టారు. అలా 2000లో పని మొదలు పెడితే ఇప్పటికి పూర్తయింది.
- ==================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...