అద్భుత వివరాల 'జంతర్ మంతర్'--మన దేశానికి చెందిన ఓ మహారాజు 300 ఏళ్ల క్రితం కట్టిన అద్భుత కట్టడం ఇప్పుడు అంతర్జాతీయ ప్రాచుర్యాన్ని పొందింది. దాని వివరాలు తెలుసుకుందాం!
ఇప్పుడు మన దగ్గర పెద్ద పెద్ద టెలిస్కోపులు ఉన్నాయి. వాటితో అంతరిక్షంలోని నక్షత్రాలు, గ్రహాల గమనాలను చూసి అనేక విషయాలను తెలుసుకోగలుగుతున్నాం. కానీ... సాంకేతిక పరికరాలేవీ లేనప్పుడే, దాదాపు 300 ఏళ్ల కిందట ఇలాంటి సమాచారాన్ని తెలుసుకోడానికి ఒక మహారాజు ఓ అద్భుతమైన కట్టడాన్ని నిర్మించాడని మీకు తెలుసా? అదే 'జంతర్ మంతర్' అనే వేధశాల (అబ్జర్వేటరీ). రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉన్న దీనిని ఇప్పుడు యునెస్కో వారు ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటిగా గుర్తించారు.
'జంతర్ మంతర్' పేరు వినడానికి వింతగా ఉన్నా, దానికర్ధమేంటో తెలుసా? లెక్కలు గట్టే యంత్రం అని. సంస్కృత పదాలైన 'యంత్ర మంత్ర' నుంచి ఈ పదాలు రూపాంతరం చెందాయి. ఈ స్థలానికి వెళ్లి చూస్తే రకరకాల ఆకారాల్లో ఉండే రాతి కట్టడాలు కనిపిస్తాయి. ఆర్క్‌లు, త్రికోణాలు, వలయాల్లాంటి రేఖాగణితానికి సంబంధించిన ఆకారాలు, వాటిపైకి ఎక్కడానికి కట్టిన మెట్లతో వింతగా కనిపించే ఇక్కడి కట్టడాలన్నీ అంతరిక్ష పరిశీలనకు ఉపయోగపడే అద్భుతమైన పరికరాలే అంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఒకో కట్టడం ఒకో యంత్రమనుకుంటే ఇక్కడ దాదాపు 17 యంత్రాలు కనపిస్తాయి. ఇవి ఒకోటీ ఒకోలా పనిచేస్తాయి.వీటి సాయంతో ఎలాంటి వివరాలు లెక్కగట్టేవారో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. కచ్చితమైన సమయం, తేదీ, గ్రహణాలు, నక్షత్రాల గమనం, భూమి కక్ష్య, గ్రహాల స్థితిగతులు, రుతువులు, వాతావరణ వివరాల్లాంటి ఎన్నో సంగతులను గ్రహించేవారు. ఇవి ఇప్పటికీ కచ్చితమైన సమాచారాన్ని అందించడం విశేషం. వీటన్నింటిలో ముఖ్యమైనదైన 'సమ్రాట్ యంత్ర' ప్రపంచంలోనే అతిపెద్ద నీడ గడియారం (సన్ డయల్). సుమారు 90 అడుగుల ఎత్తుతో ఉండే ఇది సూర్యుని కిరణాల వల్ల ఏర్పడే నీడ ఆధారంగా కేవలం రెండు సెకన్ల తేడాతో కచ్చితమైన సమయాన్ని చూపిస్తుంది. దీని నీడ సెకనుకు ఒక మిల్లీమీటరు వంతున కదులుతూ పర్యాటకులకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది.
ఇక్కడి 'ఉన్నతాంశ యంత్ర' ద్వారా గ్రహాల స్థితిగతులను లెక్కించేవారు. 'రాజ్‌యంత్ర'తో తేదీలను, పండుగ దినాలను తెలుసుకునేవారు. 'క్రాంతి యంత్ర' ఖగోళ వస్తువుల అక్షాంశ, రేఖాంశాలను కనుక్కోవడానికి వినియోగపడేది. 'చక్రయంత్ర' భూమధ్య రేఖ నుంచి గ్రహనక్షత్రాల కోణాలను తెలిపేది. ఇలా రామ్‌యంత్ర, దిగంత యంత్ర, జైప్రకాశ్ యంత్ర, రాశివలయ యంత్ర, ధ్రువ యంత్ర లాంటి కట్టడాలన్నీ రకరకాల వివరాలను అందించేవి.
జైపూర్ రాజైన సవాయ్ జైసింగ్-2 దీని నిర్మాణాన్ని 1728లో ప్రారంభించి ఏడేళ్లలో పూర్తి చేశాడు. ప్రాచీన భారత ఖగోళ శాస్త్రవేత్తగా పేరొందిన ఈయన ఇలాంటి కట్టడాలను మన దేశంలో అయిదుచోట్ల కట్టించగా, అన్నింటిలో జైపూర్‌లోదే పెద్దది.
- ===================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...