అతి పెద్ద గడియారంలో అన్నీ వింతలే!
1983 అడుగుల ఎత్తయిన టవర్... నాలుగువైపులా నాలుగు గడియారాలు... 20 లక్షల విద్యుద్దీపాలు... 12,000 కోట్ల రూపాయల ఖర్చు! అన్నీ కలిపితే.... అది ప్రపంచంలోనే అతి పెద్ద గడియారం!
ప్రపంచంలోనే అతి పెద్ద గడియారం ఎక్కడుంది? ఈ ప్రశ్నకి కొత్త సమాధానం తెలుసుకోండి. సౌదీ అరేబియాలోని మక్కాలో దీన్ని ఈమధ్యనే ప్రారంభించారు. సుమారు 600 మీటర్ల (1983 అడుగులు) ఎత్తయిన టవర్‌పై నాలుగువైపులా కనిపించేలా నాలుగు భారీ గడియారాలను ఏర్పాటు చేశారు. ఒకో గడియారం వ్యాసం 151 అడుగులు ఉంటుంది. మక్కాలో ప్రపంచంలోనే అతిపెద్ద మసీదు ఉన్న సంగతి తెలుసుగా? అక్కడే రంజాన్ పండుగ సందర్భంగా ఆవిష్కరించిన ఈ గడియారం నిర్మాణానికి 3 బిలియన్ డాలర్ల ఖర్చయింది. అంటే మన రూపాయల్లో 12000 కోట్ల రూపాయలన్నమాట.
ఇన్నాళ్లూ అతి పెద్ద గడియారం రికార్డు దేనిదో తెలుసా? ఇస్తాంబుల్‌లో 108 అడుగుల వ్యాసంతో ఉన్న సెవాహర్ మాల్ క్లాక్‌ది. ఇప్పుడు ఈ రికార్డు మక్కా గడియారం సొంతమైందన్నమాట. ఈ గడియారాలను ఏర్పాటు చేసిన 'మక్కా క్లాక్ రాయల్ టవర్'లో 76 అంతుస్థులు ఉన్నాయి. తుది మెరుగులు దిద్దుకుంటున్న దీనికి త్వరలో మరిన్ని రికార్డులు దక్కుతాయి. అవేంటో తెలుసా? ప్రపంచంలోనే రెండో ఎత్తయిన భవనం (బుర్జ్ దుబాయ్ తర్వాత), ప్రపంచంలో అతి ఎత్త్తెన హోటల్, ప్రపంచంలోనే ఎక్కువ చదరపు అడుగుల విస్తీర్ణం గల జనావాస భవనం ఇదే కాబోతోంది.
మక్కా మసీదుకు అధిపతి అయిన రాజు అబ్దుల్లా ఆధ్వర్యంలో జర్మనీకి చెందిన ఓ కంపెనీ దీని రూపకల్పన చేసింది. గడియారాల చట్రాలన్నీ బంగారంతో చేసినవే. ఆకర్షణీయంగా కనిపించడానికి వీటిని 9 కోట్ల రంగు గాజు ముక్కలతో అలంకరించారు. మొత్తం గడియారాలపై 20 లక్షల లెడ్ బల్బులను ఏర్పాటు చేశారు. గడియారాలపై 'అల్లా' అక్షరాలను 21 వేల ఆకుపచ్చ విద్యుత్ బల్బులతో ముస్తాబు చేశారు. ముస్లిములు ప్రార్థనలు జరిపే సమయాల్లో రోజుకు అయిదు సార్లు ఇవి వెలుగుతాయి. ఈ గడియారాలు 25 కిలోమీటర్ల దూరం నుంచి కూడా కనిపిస్తాయి. గడియారాలను దగ్గరగా చూసేందుకు వీలుగా టవర్‌పైకి లిఫ్టులు ఉంటాయి. టవర్ పైభాగంలో బంగారు చంద్రవంక రూపంలో ఏర్పాటుచేసిన లేజర్ కిరణాల వెలుగులు ఆకాశంలోకి 10 కిలోమీటర్ల దూరం వరకూ కనిపించేలా ప్రకాశిస్తాయి.
- ====================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...