భారతదేశ అద్భుత కట్టడాల్లో ఒకటి... ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు... మన ఏడు వింతల్లో ఒకటి... స్వాతంత్య్ర సంబరాలకు చిహ్నం... అదే ఢిల్లీలోని ఎర్రకోట!
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మన దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని మువ్వన్నెల జెండాను ఎగురవేస్తారని తెలుసుగా? టీవీల్లో ప్రత్యక్షంగా ప్రసారం చేసే ఆ సంబరాలు జరిగేదెక్కడో తెలుసా? ఎర్రకోటలో. అక్కడి నుంచే ప్రధాని మనందరినీ ఉద్దేశించి ప్రసంగిస్తారు. అంతటి ప్రాధాన్యత కలిగిన ఎర్రకోట వివరాలేంటో తెలుసుకుందామా?
'ఇలలో స్వర్గం అంటూ ఉంటే అది ఇదే... ఇదే...' అనే అర్థాన్నిచ్చే వాక్యాలు ఎర్రకోటలోని సభాస్థలి గోడలపై బంగారు అక్షరాలతో మెరుస్తూ కనిపిస్తాయి. పర్షియా కవి అమీర్ ఖుస్రో రాసిన కవితలోని ఈ పంక్తులను అక్కడ చెక్కించింది మొగల్ చక్రవర్తి షాజహాన్. ఎర్రకోట నమూనాను రూపొందించి, దగ్గరుండి కట్టించింది కూడా షాజహానే. ఎర్ర చలువరాతితో అద్భుతంగా నిర్మించిన ఈ కోట వెనుక 360 ఏళ్ల చరిత్ర ఉంది. దీని నిర్మాణాన్ని 1638లో మొదలు పెడితే 1648లో పూర్తయింది. యమునా నది ఒడ్డున, మొత్తం 120 ఎకరాల సువిశాల స్థలంలో ఈ కోటను పర్షియా నుంచి రప్పించిన నిపుణులతో కట్టించారు.
కోటలో చక్రవర్తి సభలు జరిపే మండపాన్ని దివాన్-ఇ-ఆమ్ అంటారు. యాభై అడుగుల పొడవు, 24 అడుగుల వెడల్పుతో ఉండే ఈ సభాస్థలి పైకప్పు, గోడలను వెండి బంగారాలతో తాపడం చేశారు. ఇందులోనే ప్రపంచ ప్రఖ్యాతమైన నెమలి సింహాసనం ఉండేది. ఫ్రెంచి స్వర్ణకారుడు మణులు, వజ్రాలను పొదిగి చేసిన దీనిపైనే చక్రవర్తి ఆసీనుడై సభను నడిపేవాడు. కోటలోని ఉద్యానవనాలు, పాలరాయి మండపాలు, నీటిని చిమ్మే ఫౌంటెన్లు అద్భుతంగా ఉంటాయి. ఎన్నో చారిత్రక ఘట్టాలకు ఈ కోట మౌన సాక్షి. 1657లో షాజహాన్ నలుగురు కుమారుల వారసత్వ పోరును ఇది చూసింది. సోదరులను చంపించి షాజహాన్‌ను ఖైదు చేసి జౌరంగజేబు సింహాసనాన్ని అధిష్ఠించడం దీనికి తెలుసు. తర్వాత 50 ఏళ్లలో 9 మంది రాజుల పాలనకు ఇదే కేంద్రం. పర్షియా రాజు నాదిర్‌షా 1739లో దండెత్తి వచ్చి అప్పటి రాజు మహ్మద్‌షాను ఓడించి అనేక సంపదలతో పాటు నెమలి సింహాసనాన్ని తరలించుకు పోవడాన్ని ఇది గమనించింది. బ్రిటిష్ సైనికులు 1857లో ఎర్రకోటను వశపరుచుకున్నారు. స్వాతంత్య్ర పోరాటం తర్వాత 1947 ఆగస్టు 15న తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఇక్కడ జెండాను ఎగురవేశారు. అప్పటి నుంచి ఆ సంప్రదాయం కొనసాగుతోంది.
దీని ప్రహరీగోడ రెండు కిలోమీటర్ల పొడవుగా, దాదాపు 90 అడుగులకు పైగా ఎత్తుతో ఉంటుంది. ఇందులో ముంతాజ్ మహల్ మ్యూజియం, మోతీమజీద్, రంగ్‌మహల్ ఎంతో ఆకట్టుకుంటాయి. 'బ్లడ్ పెయింటింగ్స్' మ్యూజియం, పురావస్తు మ్యూజియం, యుద్ధ స్మారక ప్రదర్శన శాలలు కూడా ఎర్రకోటలో ఉన్నాయి.
- ==========================
good information thank you
ReplyDelete