నదులపై ఆనకట్టలు కడతారని తెలుసుగా? మరి ప్రపంచంలోనే అతి పెద్ద ఆనకట్ట ఎక్కడుందో తెలుసా? చైనాలో! దీని నిర్మాణం ఈమధ్యనే పూర్తయిన సందర్భంగా సంగతులేంటో చూద్దామా!
పదిహేనేళ్లుగా ఆ ఆనకట్ట నిర్మాణం జరుగుతూనే ఉంది... దాదాపు పాతిక వేల మంది కార్మికులు పనిచేస్తూనే ఉన్నారు... 1994 నుంచి నిర్విరామంగా జరుగుతున్న పని వల్ల ఇప్పటికి దాని నిర్మాణం పూర్తయ్యే దశకు వచ్చింది. మొన్ననే నీటిని వదిలి పరీక్షించి చూశారు కూడా. అదే చైనాలోని 'త్రీ గార్జెస్ డ్యామ్'. మూడు దశలుగా నిర్మించిన ఇది ప్రపంచంలోనే అతి పెద్ద డ్యామ్ మాత్రమే కాదు, అతి పెద్ద జల విద్యుత్ కేంద్రం కూడా. దీనిని కట్టడానికి ఎంత ఖర్చయ్యిందో తెలుసా? 180 బిలియన్ల యెన్‌లు. అంటే మన రూపాయలో సుమారు లక్షా ఎనిమిదివేల కోట్ల రూపాయలు!ఈ ఆనకట్ట విస్తీర్ణం ఒకటిన్నర మైలు కాగా, ఎత్తు 600 అడుగులు.
ఈ ఆనకట్ట ఏకంగా 40 బిలియన్ల ఘనపు మీటర్ల నీటిని నిల్వ చేయగలదు! అంటే ఎంతో తెలుసా? ఆ నీటినంతా ఒక పెద్ద ఘనాకారమైనగదిలో ఉంచాలనుకుంటే ఆ గది కొలతలు సుమారు మూడున్నర కిలోమీటర్ల పొడవు, అంతే వెడల్పు, అంతే ఎత్తు ఉండాలి! ఇక ఆ డ్యామ్ నిర్మాణానికి మొత్తం 160 లక్షల ఘనపు మీటర్ల కాంక్రీటును వాడారు.
ఈ ఆనకట్టలో నిల్వ చేసిన నీటిని ఉపయోగించి 150 లక్షల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు. ఇంతే విద్యుత్‌ను బొగ్గు ఆధారితమైన విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి చేయాలంటే అందుకు ఏటా 310 లక్షల టన్నుల బొగ్గు అవసరమవుతుంది. అంటే, ఈ ఆనకట్ట పరోక్షంగా అంత బొగ్గు వినియోగాన్ని ఆదా చేస్తుందన్నమాట. ఇందువల్ల వాతావరణంలోకి విడుదలయ్యే పది కోట్ల టన్నుల వాయు కాలుష్యాన్ని ఇది ఆపుతున్నట్టే.
అయితే చైనాలో ఈ ఆనకట్టను వ్యతిరేకించేవారు కూడా ఉన్నారు. దీని వల్ల పది లక్షల మందికి పైగా జనాల్ని వారి నివాస ప్రాంతాల నుంచి తరలించాల్సి వచ్చింది. ఆనకట్ట పూర్తిగా వినియోగంలోకి వస్తే 13 పట్టణాలు, 4500 గ్రామాలు మునిగిపోయే అవకాశం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- ==========================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...