- ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
Q : బాష్పవాయువు అంటే ఏమిటి? అది ఎలా పనిచేస్తుంది?
జవాబు: గుంపులుగా చేరి ఆందోళన చేస్తున్న జనాన్ని చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువును ప్రయోగిస్తారు. ఈ వాయువు కళ్లల్లో నీరు తెప్పిస్తుంది కాబట్టి దీనిని బాష్ప వాయువు అంటారు. బాష్పవాయువు హానికరమైనది. కొన్ని రసాయనిక పదార్థాలను తుపాకుల వంటి ఆయుధాలలో కూరి, పేల్చడం ద్వారా ఈ వాయువును ప్రయోగిస్తారు. ఈ రసాయనం ఘన, ద్రవ రూపాలలో ఉంటుంది. ఆల్ఫా క్లోరాసిటెటో ఫినోన్ అనే రసాయనం ఘన రూపంలోనూ, ఇథైల్ అయోడో ఎసిటేట్ ద్రవరూపంలోనూ ఉంటాయి. బాష్పవాయువు నుంచి వెలువడిన ఆవిర్లు కళ్లలోని బాష్ప గ్రంథులపై రసాయనిక చర్య జరుపుతాయి. అందువల్ల కళ్లలో మంటపుట్టి కన్నీరు ఎక్కువగా వస్తుంది. కనుగుడ్లపై ఎక్కువగా నీరు చేరడంతో చూపు కూడా మందగిస్తుంది. కనురెప్పలు వాస్తాయి. బాష్ప వాయువు శరీరంలోని వాయు నాళాల ద్వారా ప్రవహిస్తుంది కాబట్టి కడుపులో వికారం పుట్టి వాంతులు కూడా అవుతాయి. చర్మంపై బొబ్బలు వస్తాయి. కానీ ఈ మార్పులన్నీ తాత్కాలికమే. తర్వాత తగ్గి పోతుంది. బాష్ప వాయువు ప్రయోగానికి గురైన వారిని బాగా గాలి వీచే విశాలమైన ప్రదేశానికి తీసుకువెళ్లాలి. వారి కళ్లను ఉప్పు నీటితోగానీ, బోరిక్ యాసిడ్ ద్రవంతో గానీ కడగాలి. సోడియం బైకార్బోనేట్ ద్రవాన్ని శరీరంపై బాష్పవాయువు సోకిన భాగాలకు పూయాలి. దీని ప్రభావం ఎక్కువగా పడకూడదనుకుంటే ఒక చిన్న చిట్కా ఉంది. కోసిన ఉల్లిపాయ ముక్కలను చేతిలో పట్టుకుంటే చాలు అవి బాష్పవాయువును పీల్చుకుని మన కళ్లపై అంత ప్రభావం పడకుండా చూస్తాయి.
- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్
- ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-
No comments:
Post a Comment
your comment is important to improve this blog...