Monday, May 04, 2015

వేడి నీటితో స్నానం చేస్తే ఒళ్లు నొప్పులు తగ్గుతాయి.ఎందుకు?


  • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !... 




ప్రశ్న: వేడి నీటితో స్నానం చేస్తే ఒళ్లు నొప్పులు తగ్గుతాయి. ఎందుకు?

జవాబు: చలిగా ఉన్నపుడు చర్మపు ఉపరితల పొరల్లో ఉండే కణాలు దగ్గరికి రావడం వల్ల కొంచెం ఇబ్బందికి లోనవుతాయి. పైగా చలి వాతావరణంలోకి శరీరపు వేడి వెళ్లిపోకుండా ఉండేందుకు రక్తనాళాలు కూడా ఉపరితల చర్మపు పొరలకు రక్తాన్ని చేరవేయవు. తద్వారా పైపొరల్లో ఉన్న కణాలు పొడిగా ఉంటాయి. అక్కడ ఉన్న నాడీ తంత్రులు కూడా మొద్దుబారి ఉంటాయి. ఇలాంటి స్థితిలో కాస్త వేడిగా ఉండే నీటితో స్నానం చేస్తే ఆ వేడికి చర్మపు పొరలు కొద్దిగా సడలడం వల్ల తాత్కాలికంగా విశ్రాంతి పొందినట్టుగా ఆహ్లాదకరమైన భావనను పొందుతాం. నాడీ తంత్రులకు అధిక ప్రేరణ రావడం వల్ల కూడా కొద్దిగా సుఖానుభూతి పొందుతాం.

ఇక ఏ సమయంలోనైనా బాగా కష్టపడి శారీరక శ్రమ చేసినపుడు కణాలు అలసిపోతాయి. కణాలు అలసి పోవడమంటే వాటిలో పోషక పదార్థాల పరిమితి బాగా పడిపోవడమని అర్థం. అలాగే వ్యాయామం చేసినపుడు అధిక మోతాదులో రక్తంలోని గ్లూకోజు ఆక్సీకరణం చెందుతుంది. ఆ క్రమంలో ఆక్సిజన్‌ సరఫరా తదనుగుణంగా లేకుంటే నిర్బాత ప్రక్రియ (anerobic oxidation) ద్వారా గ్లూకోజ్‌ పాక్షికంగా ఆక్సీకరణం చెంది శక్తినిస్తుంది. అపుడు రక్తంలోను, కణాల్లోను పైరూవిక్‌ ఆమ్లపు మోతాదు పెరుగుతుంది. ఇది అవాంఛనీయమైన రసాయనిక ధాతువు. ఇది ఎముకల కీళ్ల దగ్గర పోగయితే ఒంటి నొప్పులుగా ఇబ్బంది పడతాము. అలాంటి సమయంలో వేడి నీటి స్నానం వల్ల కణజాలాలు వ్యాకోచించి రక్తసరఫరా వేగవంతం అవుతుంది. ఆ క్రమంలో పైరూవిక్‌ ఆమ్లం త్వరితంగా కణాల నుంచి తొలగడం వల్ల ఒళ్లు నొప్పులు తగ్గినట్టు సేదగలిగిన సుఖానుభూతిని పొందుతాం.

- ప్రొ|| ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; జనవిజ్ఞానవేదిక, శాస్త్ర ప్రచార విభాగం (తెలంగాణ)


No comments:

Post a Comment

your comment is important to improve this blog...