Friday, May 01, 2015

Mountain areas and cooking food-పర్వత ప్రాంతాలలో ఆహార పదార్థాలు ఉడకవేం?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...







ప్రశ్న: పర్వత ప్రాంతాలలో ఆహార పదార్థాలు సరిగా ఉడకవు. ఎందుకని?

జవాబు: నీటిని వేడి చేసేప్పుడు ఉష్ణోగ్రత 100 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోగానే ఆ నీరు మరగడం ఆరంభిస్తుంది. దీన్ని నీటి భాష్పీభవన స్థానం (boiling point) అంటారు. ఈ ఉష్ణోగ్రతకు చేరిన తర్వాత కూడా నీటికి వేడిని అందిస్తే అది ఆవిరిగా మారుతుంది. నీటి ఉపరితలంపై వాతావరణ పీడనం ఉంటుంది. ఈ పీడనం వల్లనే నీరు 100 డిగ్రీల సెల్సియస్‌కన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఆవిరి కాకుండా ఉంటుంది. వాతావరణ పీడనం తగ్గితే నీటి భాష్పీభవన స్థానం కూడా తగ్గుతుంది. భూమి నుంచి పైకి వెళ్లే కొద్దీ మనం కొన్ని వాతావరణ పొరలను దాటుకొని వెళ్తున్నట్టే కాబట్టి వాతావరణ పీడనం తగ్గుతుంది. అంటే ఎత్తయిన పర్వత ప్రాంతాలలో పీడనం తక్కువగా ఉంటుందన్నమాట. అందువల్ల ఆ ప్రాంతాలలో మనం వండే ఆహార పదార్థాలపై ఆ ప్రభావం ఉంటుంది.

ఉదాహరణకు మనం బంగాళాదుంపలను ఉడికించాలనుకోండి. గిన్నెలో నీరుపోసి అందులో దుంపలను మంటపై పెడతాం. కానీ కొండలపై వాతావరణ పీడనం తక్కువగా ఉండడంతో నీటి భాష్పీభవన స్థానం కూడా తగ్గుతుంది. అంటే 100 డిగ్రీల సెల్సియస్‌ వద్ద మరగాల్సిన నీరు ఏ 94 డిగ్రీల దగ్గరో మరిగి ఆవిరైపోతూ ఉంటుంది. అందువల్ల బంగాళదుంపలు తక్కువ ఉష్ణోగ్రత వద్ద సరిగా ఉడకక పచ్చిగా ఉంటాయి. అందువల్ల పర్వత ప్రాంతాల్లో ప్రెషర్‌ కుక్కర్‌ ఉపయోగించి వంటచేయడమో లేదా దుంపలున్న గిన్నెలో కొంచెం ఉప్పు వేయడమో చేయాలి. ఎందుకంటే మంచి నీటి కన్నా ఉప్పునీటి భాష్పీభవన స్థానం ఎక్కువ.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌

  • =======================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

No comments:

Post a Comment

your comment is important to improve this blog...