ప్రశ్న: ఎలుకలకు తోకలు పొడవుగా ఉంటాయి. వాటి వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా?
జవాబు: ఎలుకలు శరీరంలోని ఉష్ణోగ్రతలను కావలసినంత మేరకు సరిచేసుకోవడానికి, తమ కదలికలను నియంత్రించుకోవడానికి తోకలను బాగా ఉపయోగించుకుంటాయి. మనం మన శరీరంపై ఉండే చర్మం ద్వారా చుట్టూ ఉన్న పరిసరాల నుంచి వేడిని గ్రహించడం లేక ప్రసరింపజేయడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంతో ఉండేలా చూసుకుంటాం. కానీ ఎలుకలు అలా చేయలేవు. ఎందుకంటే, వాటి దేహాల మీద చాలా వెంట్రుకలు ఉంటాయి. అవి ఉష్ణ నిరోధకాలు. అందువల్ల ఎలుకలు శరీరంలోని ఉష్ణోగ్రతను చర్మం ద్వారా కాకుండా వెంట్రుకలు లేని తోకల ద్వారా నియంత్రించుకుంటాయి. ఎలుకలు వాటి గుండె నుంచి ప్రసరించే రక్తంలో 0.1 నుంచి 10 శాతం వరకు తోకల గుండా ప్రవహింప చేయగలవు. దాంతో శరీరంలో ఉత్పన్నమయ్యే వేడిలో 20 శాతాన్ని వాతావరణంలోకి పంపగలవు. ఆ విధంగా వేసవికాలంలో వాటి దేహంలో ఉన్న ఎక్కువ ఉష్ణాన్ని బయటకు పంపించేస్తాయి. అలాగే చలికాలంలో తోకలో ప్రవహించే రక్త ప్రసరణాన్ని తగ్గించి ఉష్ణాన్ని బయటకు పోకుండా కాపాడుకుంటాయి.
ఇక తోకల పొడవు విషయానికి వస్తే, తోకలో ఉండే కండరాన్ని ఎలుకలు అతి నైపుణ్యంగా అదుపులో ఉంచుకుంటాయి. ఇరుకైన మార్గంలో కానీ, సన్నని తీగపైన కానీ వేగంగా పరుగెడుతున్నపుడు తోకను అటూ ఇటూ కదిలించి కింద పడకుండా చూసుకుంటాయి. సర్కస్‌లో తీగపై నడిచే వ్యక్తి ఒక పొడవైన కర్రను పట్టుకుని పడిపోకుండా బ్యాలెన్స్ చేసుకున్నట్లుగా ఎలుకలకు కూడా వాటి తోకలు బాగా ఉపయోగపడతాయి.
-ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్
- ===========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-
No comments:
Post a Comment
your comment is important to improve this blog...