ప్రశ్న: భూమి తన చుట్టూ తాను వేగంగా తిరుగుతున్నప్పుడు భూమి పైన సముద్రాలు, నదుల్లోని నీరు ఎందుకు పడిపోదు?
జవాబు: గోళాకారంలో ఉండే ఏదైనా వస్తువు మీద ఎత్తయిన ప్రదేశంలో ఉన్న వ్యక్తి ఏ దిశలోనైనా కదిలితే అతడు ఆ గోళం వంపు తిరిగే చోటకి వచ్చేప్పటికి జారుడుబల్ల మీంచి జారినట్టు పడిపోతాడు కదా? మరి భూమ్మీద అలా జరగదేం? గుండ్రంగా తిరిగే భూమిపై ఉండే మనుషులు, వస్తువులు ఆ వేగానికి విసిరివేసినట్టు ఎక్కడో పడిపోవాలి కదా?... ఇలాంటి సందేహాలు తలెత్తడం సహజమే. కానీ అలా జరగకపోవడానికి కారణం భూమి పరిమాణం, ఆకర్షణ బలమే. భూమిపై ఉండే దేన్నయినా భూమి 6350 కిలోమీటర్ల లోపల ఉన్న తన కేంద్రం వైపు బలంగా ఆకర్షిస్తూ ఉంటుంది. దీన్నే గురుత్వం (gravity) అని, దాని వల్ల కలిగే శక్తిని గురుత్వాకర్షణ శక్తి (force of gravity) అని ప్రఖ్యాత శాస్త్రవేత్త సర్ ఐజాక్ న్యూటన్ తెలిపాడు. భూమ్మీద ఉండే వస్తువులతో పోలిస్తే భూమి పరిమాణం చాలా ఎక్కువ కాబట్టి, భూమి ఎక్కడికక్కడ సమతలం (horizontal)గా, బల్లపరుపు (flat)గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఉదాహరణకు ఒక పెద్ద బంతి మీద ఉండే ఒక చీమకు ఎక్కడికక్కడ ప్రతి భాగం బల్లపరుపుగానే అనిపిస్తుంది. అలాగే మనం భూమి మీద ఏ ప్రదేశం మీద ఉన్నా, మనం కిందకు ఆనుకునే దిశే మన పాదాల నుంచి భూకేంద్రం వైపు ఉన్న దిశే అవుతుంది. ఆ దిశలోనే భూమ్యాకర్షణ శక్తి పనిచేయడం వల్ల భూమిపై ఉండే ప్రతి వస్తువూ భూమికి అంటిపెట్టుకుని ఉంటుందే తప్ప, భూమి నుంచి పడిపోదు. అందువల్లనే భూమి వేగంగా తిరుగుతున్నా దానిపై ఉన్న సముద్రాలు, నదులలోని నీరు కూడా ఎక్కడికీ జారదు. పడిపోదు.
- ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- ==============================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...