ప్రశ్న: జిరాక్స్ యంత్రం ఎలా పనిచేస్తుంది?.
జవాబు: ఏ డాక్యుమెంటుకైనా నకలును సృష్టించే యంత్రాన్ని జిరాక్స్ (xerox)యంత్రం అంటారు. ఇందులో క్షణాల్లో జరిగే అద్భుతాన్ని తెలుసుకోవాలంటే ఒక భౌతిక శాస్త్ర సూత్రాన్ని అర్థం చేసుకోవాలి.
గాలి వూదిన బెలూన్‌ను రుద్దితే అది చిన్న చిన్న కాగితం ముక్కల్ని ఆకర్షిస్తుంది. దీనికి కారణం బెలూన్ ఉపరితలంపై స్థిర విద్యుత్ (static electricity) ఏర్పడడమే. విద్యుదావేశాలు (electric charges) రెండు రకాలు. ధనావేశం(positive charge) ఒకటైతే, రుణావేశం (negative charge) మరొకటి. భిన్న ఆవేశాలు ఆకర్షించుకుంటాయని తెలుసుకదా? ఈ సూత్రంపైనే జిరాక్స్ యంత్రం పనిచేస్తుంది.
ఈ యంత్రంలోని ఓ ప్రత్యేకమైన డ్రమ్ము బెలూన్‌లాగే పనిచేస్తుంది. అంటే దానిపై స్థిరవిద్యుత్‌ను కలిగించవచ్చన్నమాట. ఇంకా ఈ యంత్రంలో ఉండే టోనర్‌లో అతి సన్నని నల్లటి పొడి ఉంటుంది. స్థిరవిద్యుత్ ఏర్పడిన డ్రమ్ము ఈ నల్లటి పొడిని ఆకర్షిస్తుంది. డ్రమ్ముపై అక్కడక్కడ మాత్రమే స్థిరవిద్యుత్ ఏర్పడేలా చేయవచ్చు. అప్పుడు ఆయా ప్రాంతాలు మాత్రమే నల్లటి పొడిని ఆకర్షిస్తాయి. అలా డ్రమ్ముపైన మనకు కావలసిన విధంగా స్థిరవిద్యుత్‌తో కూడిన ఒక ప్రతిబింబాన్ని ఏర్పరచే వీలుంటుంది. అంటే ఒక డాక్యుమెంటులో ఎక్కడెక్కడ నల్లగా ఉంటుందో అక్కడ మాత్రమే స్థిరవిద్యుత్ ఏర్పడి నల్లటి పొడి అంటుకునే విధంగా డ్రమ్మును మార్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆ డ్రమ్ము ద్వారా ముద్రితమయ్యే కాగితంపై ఆ డాక్యుమెంటు నకలు యధాతధంగా వస్తుంది. డ్రమ్ముపై మనం అనుకున్న చోటనే స్థిరవిద్యుత్ ఏర్పడేలా చేయడానికి కాంతి తోడ్పడుతుంది. అందుకే ఈ యంత్రాన్ని 'ఫొటో కాపీయర్' అని కూడా అంటారు.
డ్రమ్ముని ఫొటోవిద్యుత్ వాహక (photo conductive) పదార్థం (కాడ్మియం లేదా సెలీనియం)తో నింపుతారు. కాంతి ప్రసరించినప్పుడు ఈ డ్రమ్ము ఉపరితలమంతా ధనావేశం ఏర్పడుతుంది. యంత్రంలో మనం ఒక డాక్యుమెంటును పెట్టినప్పుడు దానిపై శక్తివంతమైన కాంతి కిరణాలు ప్రసరించే ఏర్పాటు ఉంటుంది. అవి డాక్యుమెంటులోని తెల్లని ప్రాంతాల ద్వారా పరావర్తనం చెంది డ్రమ్ము మీద పడతాయి. ఆ కిరణాలు పడిన ప్రాంతాల్లో మాత్రం డ్రమ్ములోని పదార్థం నుంచి ఎలక్ట్రాన్లు వెలువడి డ్రమ్ము ఉపరితలంపై ఆయా ప్రాంతాల్లో ఉన్న ధనావేశాన్ని తటస్థపరుస్తాయి. ఫలితంగా డాక్యుమెంటులో ఎక్కడెక్కడ నల్లని అక్షరాలు, చిత్రాలు ఉన్నాయో, అక్కడక్కడ మాత్రమే డ్రమ్ముపై ధనావేశం నిలిచి ఉండి, ఆ ప్రాంతాలే టోనర్‌లోని నల్లని పొడిని ఆకర్షిస్తాయి. ఇప్పుడు ఆ డ్రమ్ము ఉపరితలం మీదుగా వేరే తెల్ల కాగితాన్ని ప్రయాణించేలా చేయడం వల్ల టోనర్ పొడి కాగితంపై అంటుకుంటుంది. కాగితం బయటకి వచ్చే మార్గంలో ఉండే ఉష్ణవిభాగం ద్వారా కలిగే అత్యధిక వేడి వల్ల ఆ పొడి కాగితానికి గాఢంగా అంటుకుపోయి నకలు కాపీ ముద్రితమై బయటకు వస్తుంది.
- ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- =========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...