ప్రశ్న: వాహనాలు ఇసుకలో జారిపోతాయి. ఎందుకు?
జవాబు: నేల మీద సంచరించే ఏ జీవి అయినా, ఏ సాధనమైనా ముందుకు కదలాలంటే భూమ్యాకర్షణ (gravitational attraction)ను అధిగమించాల్సిందే. ఇందుకు నేల మీద తగినంత పట్టు (grip) కావాలి. నేల వల్ల కలిగే ఘర్షణ (friction) వల్ల ఇది సిద్ధిస్తుంది. నేల లేదా బాట మీద ఎంత వైశాల్యం మేరకు అంటిపట్టుకుంటే అంత ఎక్కువగా ఘర్షణ లభిస్తుంది.ఈ ఘర్షణను అధిగమించే చోదక శక్తి జీవులకు కండరాల బలం ద్వారా, వాహనాలకు స్వయం చోదక యంత్రం(auto-mobile engine)ద్వారా లభిస్తుంది. ఘర్షణ కదలకుండా నిరోధించడానికి ప్రయత్నిస్తే, చోదకశక్తి దీనికి వ్యతిరేక దిశలో ప్రతిచర్యను కలిగించుకుని చలనానికి పనిచేస్తుంది. ఘర్షణ లేనిదే ఈ అభిముఖచలనం (forward movement) సాధ్యం కాదు. సాధారణంగా రోడ్లు గట్టిగా, బిగుతుగా ఉండడం వల్ల వాహనాలకు కావలసిన ఘర్షణ లభిస్తుంది. కానీ ఇసుక చాలా వదులుగా పటుత్వం లేకుండా ఉండడం వల్ల వాహనాల చక్రాలకు తగినంత పట్టు దొరకదు. అందువల్లనే చక్రాలు ఒకే చోట తిరుగుతూనే ఉండిపోతాయి కానీ వాహనం ముందుకు కదలదు. ఇదే పరిస్థితి బురద, అతి నున్నని ప్రదేశాల్లోనూ కలుగుతుంది. అలాగే వాహనం టైర్లు అరిగిపోయినా ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. నున్నని ప్రదేశాల్లో మనం జారిపడడానికి కూడా ఇదే కారణం.
- ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- ========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...