ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్రశ్న:'డి' విటమిన్ ఉదయపు సూర్యకిరణాల్లో మాత్రమే ఉంటుందా? మధ్యాహ్నం, సాయంత్రపు కిరణాల్లో ఉండదా?
జవాబు: పేరుకు 'డి' విటమిన్ అంటూ ఏకవచనంలో సంబోధించినా అది కొన్ని రసాయనాల సమ్మేళనం. విటమిన్ డి1, డి2, డి3, డి4, డి5 అనే ఐదు విభిన్న రసాయనాల సమస్తాన్ని కలగలిపి 'డి' విటమిన్ అంటారు. ఇందులో డి3 అనేది చాలా ముఖ్యమైనది. ఇది మాత్రమే సూర్యరశ్మి సమక్షంలో మనలోను, ఇతర క్షీరదాల (mammals) లోను తయారవుతుంది. దీన్నే రసాయన పరిభాషలో కోలికాల్సిఫెరాల్ అంటారు. ఇది మన చర్మంలో సూర్యరశ్మి సమక్షంలో కొలెస్టరాల్ నుంచి తయారవుతుంది. నిజానికి సూర్యరశ్మిలో ఉండే ఎంతో కొంత అతినీలలోహిత కాంతి (ultraviolet light) సమక్షంలోనే డి విటమిన్ ఏర్పడుతుంది. ఉదయం, సాయంత్రం ఎండల కన్నా మధ్యాహ్నపు ఎండలోనే ఆ కిరణాలు ఎక్కువ ఉంటాయి. కానీ మధ్యాహ్నపు ఎండను భరించడం కష్టం కాబట్టి ఉదయపు ఎండలో పిల్లల్ని తిప్పితే మంచిదంటారు. మొత్తానికి సూర్యకిరణాల్లో విటమిన్లు ఉండవని, వాటి సమక్షంలో మన చర్మంలోనే డి విటమిన్ తయారవుతుందని గమనించాలి.
-ప్రొ||ఎ. రామచంద్రయ్య,--నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- =======================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...