ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్రశ్న: రిక్టర్ స్కేలు అంటే ఏమిటి? దీనిని ఎలా ఉపయోగిస్తారు?.
జవాబు: భూకంపాలను సీస్మోగ్రాఫ్ అనే పరికరంతో కొలుస్తారు. ఈ పరికరం ద్వారా భూకంపాల తీవ్రతను తెలుసుకోడానికి ఉపయోగించే ప్రామాణికమైన స్కేలే రిక్టర్‌స్కేలు.
భూకంపాల సమయంలో భూమి కదలికలను కచ్చితంగా రికార్డు చేయడమే సీస్మోగ్రాఫ్ లక్ష్యం. పెద్ద పెద్ద ట్రక్కులు, రైళ్లు వేగంగా పోతున్నప్పుడు వాటి మార్గాలకు దగ్గరగా ఉండే భవనాలు కంపించడం తెలిసిందే. ఇలాంటి కంపనాలను కాకుండా అసలైన భూకంపాలను కొలవడానికి వీలుగా సీస్మోగ్రాఫ్ పరికరాన్ని భూమి అంతర్భాగంలోని కఠినమైన శిలలకు అనుసంధానం చేస్తారు. భూమి కంపించే పరిస్థితుల్లో కూడా ఇది స్థిరంగా ఉండడానికి దీని ద్రవ్యరాశి ఎక్కువగా ఉంటుంది. అతి తక్కువ ప్రకంపనాలను కూడా గ్రహించగలిగేంత సున్నితంగా సీస్మోగ్రాఫ్‌లు ఉంటాయి.
సీస్మోగ్రాఫ్‌లో ఉపయోగించే రిక్టర్‌స్కేలుపై నమోదయ్యే వివరాలు సంవర్తమానం (logarithms)లో ఉంటాయి. అంటే ఈ స్కేలుపై ఉన్న సంఖ్యలు పదేసి రెట్ల తీవ్రతకు సంకేతాలుగా ఉంటాయి.ఉదాహరణకు రిక్టర్‌స్కేలుపై 3గా నమోదయ్యే తీవ్రత కన్నా, 4గా నమోదయ్యే తీవ్రత పదిరెట్లు అధికమన్నమాట. అలా 4గా నమోదయ్యే తీవ్రత కన్నా 8గా నమోదయ్యే తీవ్రత 10,000 రెట్లు అధికం. ఈ స్కేలుపై 2 కంటే తక్కువగా నమోదయ్యే భూకంపాలు మన అనుభవంలోకి రావు. వీటిని సూక్ష్మ ప్రకంపనాలు అంటారు. ఆరు కన్నా ఎక్కువగా నమోదయ్యే భూకంపాలే చెప్పుకోదగ్గ హాని కలిగిస్తాయి.
-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- =========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...