Saturday, August 27, 2011

మలము దుర్గంధము గా ఉండడానికి కారణమేమిటి?,Foecal mater is foul-smelling Why?




ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

Q : మనం రకరకాల ఆహారపదార్థాలు తీసుకుంటాము. ఎన్నో రుచికరమైన, సువాసన భరితమైన మసాలా దినుసులతో ఆహారాన్ని, పానీయాల్ని సేవిస్తాము. కానీ జీర్ణమయ్యాక మిగిలిన వ్యర్థాలు (మలమూత్రాలు) దుర్గంధంగా ఉండడానికి కారణమేమిటి?

A : తీసుకున్న ఆహారపదార్థాలలోని పిండిపదార్థాల్లోంచి గ్లూకోజు, ఫ్రక్టోజులు, మాంసకృత్తుల నుంచి వివిధ అమైనో ఆమ్లాలు, కొవ్వు పదార్థాల నుంచి కణత్వచాని (cell wall) కి ఉపయోగపడే లిపిడ్లు ఉత్పన్నమవుతాయి . అవి చిన్నప్రేవులో ఉండే విల్లై అనే కణపొర ద్వారా రక్తంలో కలుస్తాయి . ఇంతవరకు బాగానే ఉంది. అయితే నోటి నుంచి గుదము (anus) వరకు వ్యాపించిన దాదాపు 2, 3 మీటర్ల పొడవుండే జీర్ణకోశ వ్యవస్థలో పలుచోట్ల పలురకాలైన భౌతిక రసాయనిక స్థితులు ఉంటాయి. అనువైన చోట్ల మన పుట్టుక వెంటనే ఎన్నో బాక్టీరియాలు మన జీర్ణవ్యవస్థలో తమ స్థావరాల (colonies) ను ఏర్పరుచుకొంటాయి. ఇందులో అపాయకరమైన బాక్టీరియాలు, ఉపయోగపడే బాక్టీరియాలు రెండూ ఉంటాయి. మనకు నోటిలో పుండ్లు రావడం, విరేచనాలు రావడం, వాంతులు రావడం, అజీర్తి వంటి పలు అవాంఛనీయమైన లక్షణాలకు కారణం ప్రమాదకర బాక్టీరియాలు మన జీర్ణవ్యవస్థలో ఉండడమే. ఇచరేరియాకోలై (E.Coli), సాల్మొనెల్లా, జియార్డియా (giordia), క్రిప్టోస్పోరిడియం (cryptosporidum) వంటివి ప్రేగుల్లో ఉంటాయి. ఉపయోగపడే బాక్టీరియాను ప్రొబయోటిక్స్‌(probiotics) అంటారు. ఇందులో లాక్టోబాసిల్లస్‌ అసిడోఫిలస్‌ (Lactobacillus acidophilus), బైఫిడోబాక్టీరియా బైఫ్రిడమ్‌ (Bifidobacteria bifridum) వంటివి ఉదాహరణలు.

మంచి బాక్టీరియా అయినా చెడు బాక్టీరియా అయినా అవీ బతకాలి. తమ సంతానాన్ని పుంఖాను పుంఖాలుగా పెంచుకోవాలి. కాబట్టి వాటికీ ఆహారం అవసరం. కొన్ని బాక్టీరియాలు వాటి సంఖ్య మించితే మనకు వాంతులు, విరేచనాలు, కలరా, డయేరియా లాంటి వ్యాధులతో తెలిసిపోయినా వాటి సంఖ్య అదుపులో ఉన్నంతవరకు వాటిని మన తెల్లరక్తకణాలు నాశనం చేస్తుంటాయి. కాబట్టి బాక్టీరియాలు మన కణాల్ని తింటూ వాటి విసర్జక పదార్థాల్ని జీర్ణమవుతున్న మన ఆహారపదార్థాల మిశ్రమంలోనే కలుపుతాయి. అందులో చాలా దుర్గంధభరితమైన గంధకం, ఫాస్ఫరస్‌, నత్రజని సమ్మేళనాలు ఉంటాయి.

చాలాసార్లు మన ఆహారాన్నే అవీ భాగం పంచుకొని మనలాగా కాకుండా మరో విధమైన అవాయు ప్రక్రియ (anaerobic metabolism) ద్వారా ఆక్సిజన్‌ అవసరం లేకుండానే శక్తిని పొంది తమ జీవన కార్యకలాపాల్ని కొనసాగిస్తాయి. అవాయు ప్రక్రియల్లో ఎన్నో దుర్గంధభరితమైన పదార్థాలు విడుదలవుతాయి. ఉపయోగపడే బాక్టీరియాలు కూడా పెద్దప్రేవుల్లో ఉంటాయి. ఇవి మన జీర్ణవ్యవస్థలో జీర్ణం కాగా మిగిలిన వ్యర్థ పదార్థాల మీద ఆధారపడి బతుకుతుంటాయి.అవి ఒక్కోసారి దుర్గంధాన్ని తగ్గిస్తాయి. మరోసారి దుర్గంధాన్ని పెంచుతాయి. ఈ విధంగా మనం తీసుకున్న పంచభక్ష్య పరమాన్నాలు, సుగంధభరిత పానీయాలు, షడ్రుచుల ఆహారదినుసులు నోటి వరకే వాటి సౌభాగ్యం. ఆ తర్వాత అవి రకరకాల రసాయనిక ప్రక్రియల్లో, జీవ రసాయనిక ప్రక్రియల్లో, బాక్టీరియా కౌగిళ్లలో ... లోగిళ్లలో పడిపోయి వివిధ మార్పులకు లోనవుతాయి. చివరకు దుర్గంధ భరితమైన మలమూత్రాదుల రూపంలో బయటపడతాయి. ఇందులో ఉపయోగపడే బాక్టీరియాల వంతూ ఉంది కాబట్టి ఆ కంపే ఆరోగ్యానికి ఇంపు అనుకోకతప్పదు.


courtesy : prajashakti news paper / Ramachandrayya A prof. editor -chekumuki janavijyaana vEdika.
  • ======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...