భారత రాజ్యాంగం రూపుదిద్దుకోవడానికి ఏర్పాటైన కమిటీకి అధ్యక్షులు డా. అంబేద్కర్ . కమిటీ సబ్యులు : అల్లాడి కృష్ణస్వామి అయ్యంగారు , డా.కె.ఎం.మున్షి , సయ్యద్ ఎం.జి.సాదుల్లా, మాధవరావు , టి.టి.కృష్ణమాచారి మున్నగువారు .
భారత రాజ్యాంగం (Constitution of India) ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. 1950 జనవరి 26 న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాత స్వతంత్ర భారత దేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం గా అవతరించింది. ప్రతి సంవత్సరం ఆ రోజును గణతంత్ర దినంగా జరుపుకుంటారు. భారత ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా జరగాలి అనే విషయాలను రాజ్యాంగం నిర్దేశించింది. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థల ఏర్పాటు, ఆయా వ్యవస్థల అధికారాలు, బాధ్యతలు, వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలో కూడా నిర్దేశిస్తోంది.
భారత రాజ్యాంగాన్ని తయారు చెయ్యడానికి ఒక రాజ్యాంగ సభను ఏర్పాటు చేసారు. ఈ సభలో సభ్యులను పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకున్నారు. సభ్యుల కూర్పు ఇలా ఉన్నది:
* రాష్ట్ర శాసనసభల ద్వార ఎన్నికైన సభ్యులు: 292
* భారత్ సంస్థానాల నుండి ఎన్నికైన సభ్యులు: 93
* ఛీఫ్ కమిషనర్ ప్రావిన్సుల ప్రతినిధులు: 4
ఈ విధంగా మొత్తం సభ్యుల సంఖ్య 389 అయింది. అయితే, మౌంట్‌బాటెన్ యొక్క జూన్ 1947 నాటి దేశ విభజన ప్రణాళిక కారణంగా ఈ సభ్యుల సంఖ్య 299కి తగ్గిపోయింది. రాజ్యాంగ సభ మొదటి సమావేశం ఢిల్లీలో ఇప్పటి పార్లమెంటు భవనపు సెంట్రల్ హాలులో 1946, డిసెంబర్ 9 న జరిగింది. మొత్తం 211 మంది సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అందులో 9 మంది మహిళలు. డా.సచ్చిదానంద సిన్‌హాను సభకు అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. జవహర్‌లాల్ నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్, సర్దార్ పటేల్, ఆచార్య జె.బి.కృపలానీ, డా.రాజేంద్ర ప్రసాద్, సరోజినీ నాయుడు, రాజాజీ, బి.ఆర్.అంబేద్కర్, టంగుటూరి ప్రకాశం పంతులు, పట్టాభి సీతారామయ్య మొదలైన వారు ఈ సభలో సభ్యులు.
1947 ఆగష్టు 14 రాత్రి రాజ్యాంగ సభ సమావేశమై, ఖచ్చితంగా అర్ధరాత్రి సమయానికి స్వతంత్ర భారత శాసన సభగా అవతరించింది. రాజ్యాంగం రాతప్రతిని తయారు చెయ్యడం కొరకు 1947 ఆగష్టు 29 న రాజ్యాంగ సభ ఒక డ్రాఫ్టు కమిటీని ఏర్పాటు చేసింది. డా.బి.ఆర్.అంబేద్కర్ ఈ కమిటీకి అధ్యక్షుడు.
- ===========================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...