-ఎమ్. నిఖిల్, హన్మకొండ
జవాబు: చలనం (locomotion) అనేది ప్రాణుల లక్షణాల్లో ప్రధానమైనది. ఏ జీవి చలనమైనా శరీరంలో కొంత భాగాన్ని నేలకి సంధానిస్తూ, అదే సమయంలో ఇతర భాగాల్ని నేల నుంచి విముక్తి చేసుకుంటూ జరగాల్సిందే. మనుషులు, పశువుల వంటి పాదచారుల విషయంలో కాళ్లు ఒకటి తర్వాత మరొకటిగా నేల మీద ఆనుతూ, పైకి లేస్తూ ఉండడం అందరూ గమనించే విషయమే. ఇలా చేసినప్పుడే న్యూటన్ మూడవ గమన సూత్రం ప్రకారం ప్రతి చర్య (reaction) ఏర్పడి చలనం సాధ్యమవుతుంది. కాళ్లు, పాదాలు లేని పాముల్లాంటి జీవుల చలనానికి వాటి శరీరంపై ఉండే పొలుసులే ఆధారం. పాము విషయంలో దాని పొట్ట కింద ఉండే పొలుసుల్లో కొన్ని నేలను పట్టి వెనక్కి నెట్టుతుంటే, మరికొన్ని నేలను అంటుకోకుండా ముందుకు సాగాల్సి ఉంటుంది. ఇలా జరగాలంటే రెండే పద్ధతుల్లో సాధ్యమవుతుంది. నేలను అంటిన భాగం కాకుండా మిగతా శరీర భాగం భూమికి లంబంగా (vertical)గా ఉండాలి. లేదా నేలను అంటిన భాగం కాకుండా మిగతాది నేలకు సమాంతరంగా (horijantal)గానైనా ఉండాలి. ఈ రెండూ కాని పక్షంలో నేలను ఆనుకుని ఉండే శరీరభాగాన్ని వ్యాకోచింప చేసుకోవాలి. మొదటి పద్ధతిలో గొంగళిపురుగుల్లాంటివి పాకడాన్ని గమనిస్తాం. ఇక చివరి విధానంలో వానపాముల చలనం ఉంటుంది. ఈ రెండు పద్ధతులకు పాము శరీరం అనుకూలంగా ఉండకపోవడం వల్ల అది రెండో పద్ధతిని పాటిస్తుంది. అందుకే వంకరటింకర నడక, పరుగు.
-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- =======================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...