ప్రశ్న: ఎప్పుడూ నీటిలోనే ఉండే చేపలకి దాహం వేస్తుందా? అవి నీటిని తాగుతాయా?
-ఎన్. అమరేందర్ రెడ్డి, హైదరాబాద్
జవాబు: ఈ ప్రశ్నకు జవాబు అవును, కాదు అని రెండు విధాలుగా చెప్పవచ్చు. ఎందుకంటే, ఉప్పునీటి చేపలు నీళ్లు తాగుతాయి. అదే మంచినీటిలో ఉండే చేపలు నీళ్లు తాగవు. దీనికి కారణం తెలుసుకోవాలంటే భౌతిక శాస్త్రంలోని ద్రవాభిసరణము (osmosis) అనే ప్రవాహుల (fluids) ధర్మాలను తెలుసుకోవాలి. వీటి ప్రకారం రెండు వేర్వేరు గాఢతలు (concentrations) గల ద్రవాలను ఒక సన్నని పొర (మెంబ్రేన్) విడదీస్తుంటే, నీరు ఎక్కువ గాఢతగల ద్రవం వైపు ప్రవహిస్తుంది.
మంచి నీటిలో ఉండే చేప శరీరంలోని ద్రవం, దాని చుట్టూ ఉండే నీటి గాఢత కన్నా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆ చేప శరీరంలోకి బయటి నీరు దాని చర్మం, మొప్పల ద్వారా శోషింపబడుతుంది. అలా దాని శరీరంలోకి ప్రవేశించిన నీటిని చేప బయటకు వదలక పోతే సమయం గడిచే కొద్దీ ఎక్కువ నీరు చేరడం వల్ల దాని శరీరం విచ్ఛిన్నమయ్యే పరిస్థితి వస్తుంది. ఇక ఉప్పునీటి చేప విషయంలో ఈ ప్రక్రియ వ్యతిరేక దిశలో జరుగుతుంది. ఇక్కడ చేప చుట్టూ ఉండే నీటి గాఢత ఎక్కువగా ఉండడంతో చేప శరీరంలోని నీరు బయటకి స్రవిస్తుంది. అందువల్ల ఉప్పునీటి చేప సమయం గడిచే కొద్దీ శరీరంలోని నీటిని కోల్పోవడం వల్ల శుష్కించి, ఎండిపోయే పరిస్థితి ఉంటుంది. ఇలా జరగకుండా ఉండేందుకు ఆ చేప తన చుట్టూ ఉండే నీటిని మొప్పలు, నోటి ద్వారా తాగుతుంది. ఆ నీరు దాని శరీరంలోకి చేరక ముందే మొప్పలు ఉప్పునీటిలోని ఉప్పును విసర్జిస్తాయి.
-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- ======================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...