ప్రశ్న: కార్ల ప్రధాన లైట్లను పలకలుగా ఉండే పెట్టెల్లో పెడుతున్నారెందుకు?
-కె. హయగ్రీవాచారి, వరంగల్
జవాబు: కార్లలాంటి వాహనాలు చీకట్లో ప్రయాణించేప్పుడు దారి కనిపించడం కోసం ప్రధాన దీపాలను (హెడ్‌లైట్స్) అమరుస్తారన్న విషయం తెలిసిందే. చాలా కాలం వరకూ వీటిని అర్థచంద్రాకారంలో (పారాబోలిక్) ఉండే నున్నని గోడలుగల పెట్టెల్లో అమర్చేవారు. లైట్ వెలిగినప్పుడు దాని నుంచి వెనక్కి ప్రసరించే కాంతి కిరణాలు సైతం, ఈ నున్నని ఆకారంపై పడి పరావర్తనం చెంది తిరిగి ముందుకే వెళ్లేవి. ఇందువల్ల వాహనం ముందు ఉండే మార్గంపై ఎక్కువ కాంతి పడేది. అయితే ఇలాంటి అమరికలో ఉండే లైట్ల వల్ల కాంతి ఒక వలయాకారంలో కేంద్రీకృతమై పడేది కానీ, మార్గానికి అటూ ఇటూ ఉండే పరిసరాలపై వెలుగు ప్రసరించేది కాదు. తర్వాత్తర్వాత ఆధునిక హేలోజన్ ప్రక్రియ వల్ల అధిక కాంతిని ఇవ్వగల లైట్ల తయారీ మొదలైంది. ఈ లైట్ల వెనకవైపు కాంతి పరావర్తనానికి ఉపయోగపడేలా అమర్చే గోడల పరికరాల్లో సైతం మార్పు వచ్చింది. ఇవి నున్నగా కాకుండా ఉబ్బెత్తుగా అనేక పలకలుండే ఉపరితలంతో కూడినవి వచ్చాయి. లైట్ల నుంచి వచ్చే కాంతి కిరణాలు ఈ పలకలపై పడి అనేక దిశల్లోకి పరావర్తనం చెంది చెల్లాచెదురై మార్గం పైకి ప్రసరిస్తాయి. అందువల్ల కేవలం రోడ్డు మాత్రమే కాకుండా అటూ ఇటూ ఉండే పరిసరాలు కూడా కనిపిస్తాయి. పైగా ఎదురుగా వచ్చే వాహనదారుల కళ్ల మీద బైర్లు కమ్మేలా కాంతి పడదు కూడా.
-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- =====================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...