అనగనగా ఒక మొక్క... 100 ఏళ్లకి పూస్తుంది... ఒకేసారి వేలాది పూవులు... ఏకంగా కోటి విత్తనాలు... పుష్పించగానే చనిపోతుంది!
ఖలేజా సినిమా గుర్తుందా? అందులో పదేళ్లకు ఒకసారి పూసే మొక్కను పీకేశాడని హాస్యనటుడు అలీకి వింత శిక్షను వేస్తారు. సినిమా సంగతి సరేకానీ, అలా అరుదుగా పుష్పించే మొక్కలు ఉన్నాయా? ఉన్నాయి! అలాంటిదే పుయా రైమండి. 'క్వీన్ ఆఫ్ ఆండెస్' అని పిలిచే ఈ మొక్క లక్షణాలన్నీ వింతైనవే. ఇది కనిపించేది ప్రపంచంలో రెండే రెండు చోట్ల. అదీ ఎత్తయిన కొండ ప్రాంతాలపై. ఎదిగేది ఏకంగా 33 అడుగుల ఎత్తుగా. జీవించేది దుర్భర పరిస్థితుల్లో. ఇది కేవలం ఏ 80 ఏళ్లకో, వందేళ్లకో పూస్తుంది. అప్పుడు ఆ మొక్కంతా చిన్నచిన్న పూలు కనీసం మూడునాలుగు వేలు విచ్చుకుంటాయి. వీటి ద్వారా ఏకంగా కోటి విత్తనాలు ఏర్పడుతాయి. ఎంత మొండి మొక్కయినా పాపం... ఇప్పుడిది అంతరించిపోయే దశలో ఉంది.
ఇవి కేవలం పెరూ, బొలివియా దేశాల్లోని ఎత్తయిన పర్వత ప్రాంతాల్లోనే కనిపిస్తాయి. కొమ్మలు, ఆకులు లేని కాండంలాగా, నిట్టనిలువుగా, ఓ పెద్ద స్తంభంలాగా ఎదిగే దీని నిండా అన్నీ ముళ్లే. పైగా ఇవి లోపలికి ముడుచుకునే తత్వం కలిగి ఉంటాయి. దీంట్లోకి చెయ్యి పెడితే ముళ్లు గుచ్చుకోకుండా తీసుకోవడం కష్టం. అందుకే ఒకోసారి పక్షులు దీనిపై వాలి వాటి ముళ్లమధ్య చిక్కుకుపోతాయి. గొర్రెలాంటి పశువుల మొఖాలు కూడా వీటి ముళ్ల వల్ల గాయపడతాయని అక్కడి జనానికి ఇదంటే కోపం. కనిపిస్తే చాలు నరికేసి నాశనం చేస్తారు.
సముద్రమట్టానికి దాదాపు 15,000 అడుగులపైగా ఉండే కొండప్రాంతాల్లోనే కనిపించే ఇవి ప్రకృతిలోని వింత మొక్కల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్నాయి. వీటి సంఖ్య పెరూలో 8 లక్షలనీ, బొలీవియాలో 35 వేలనీ తేల్చారు కానీ చాలా తొందరగా కనుమరుగవుతున్నాయని గమనించారు. అందుకే వీటి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. వీటిని మొదటిసారి 1830లో పెరూలో ఓ ఫ్రెంచ్ శాస్త్రవేత్త కనుక్కున్నాడు. పెరూలో ఉండి అనేక ఏళ్ల పాటు వివిధ మొక్కలపై పరిశోధన చేసిన ఓ ఇటలీ శాస్త్రవేత్త పేరునే దీనికి పెట్టారు.
- =============================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...