మన గాలి శూన్యంలోకి పోదేం?
ప్రశ్న: గాలి అధికపీడనం నుంచి అల్పపీడనానికి వ్యాపనం చెందుతుంది కదా. మరి భూమి మీదున్న గాలి శూన్యంగా ఉన్న అంతరిక్షంలోకి ఎందుకు పోదు?
- ఆర్. శ్రీశైలం, 10వ తరగతి, పడకల్ (మహబూబ్‌నగర్)
జవాబు: అధిక పీడనం ఉన్న ప్రాంతాల నుంచి అల్పపీడనం ఉన్న ప్రాంతాల వైపు వ్యాపనం (diffusion) చెందడం గాలుల లక్షణం. భూమ్మీద గాలి ప్రవాహాలు, తుపానులు, సుడిగాలులు ఇలా ఏర్పడేవే. గాలికి ద్రవ్యరాశి (mass) ఉంది. భూమ్మీద వ్యాపించి ఉన్న మొత్తం గాలి బరువు సుమారు 5X1018కిలోలు భూమి బరువు దాదాపు 6X10 24కిలోగ్రాములు. రెండు పదార్థాల మధ్య గురుత్వాకర్షణ ఉంటుందనేది తెలిసిందే. అలాగే భూమికీ, భూమ్మీద ఉన్న గాలికీ మధ్య గురుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువగా ఉంది. దీని ప్రభావం గాలికి ఉన్న వ్యాపన లక్షణం కన్నా అధికం కావడం వల్లనే భూమిని గాలి అంటిపెట్టుకునే ఉంటుంది. భూవాతావరణంలో ఉన్న గాలి సుమారు 30 కిలోమీటర్ల ఎత్తు వరకూ వ్యాపించి ఉన్నా, గాలిలోని 75 శాతం కేవలం 10 కిలోమీటర్ల ఎత్తు వరకూ ఉండే టోపోస్ఫియర్ పొరలోనే ఉంటుంది. చంద్రుడి ద్రవ్యరాశి వాతావరణ వ్యాపనాన్ని నివారించగల స్థాయిలో లేనందువల్ల అక్కడ గాలి లేదు.
-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్;రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- ===========================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...