ఫ్లెమింగో పక్షి గురించి తెలుసు కదా! నాజూకైన మెడతో గులాబీ రంగులో చూడ్డానికి భలే ముచ్చటగా కనిపిస్తుందిది. అది ఆ రంగులో ఉండడానికి కారణమేంటో తెలుసా? మేకప్ చేసుకొని ముస్తాబవుతుంది కాబట్టే! స్పెయిన్ శాస్త్రవేత్తలు ఏళ్ల తరబడి పరిశోధనలు చేసి మరీ ఈ సంగతి కనిపెట్టారు. మనం ముస్తాబయ్యేది ఎదుటివారిని ఆకర్షించడానికే కదా? అలాగే ఇవి కూడా జతకట్టే పక్షిని ఆకర్షించడానికే ఇలా చేస్తాయని తేలింది. మనం ముఖానికి క్రీములు రాసుకున్నట్టే ఇవి గులాబీ రంగును ఒళ్లంతా చక్కగా పులుముకుని మేకప్ వేసుకుంటాయని గమనించారు. మరి ఆ రంగు ఎక్కడి నుంచి వస్తుంది? మనలా ఏ దుకాణానికో వెళ్లి కొనవు. వాటి తోక దగ్గరుండే ఓ గ్రంధి నుంచి ఓ రకమైన తైలం విడుదలవుతూ ఉంటుంది. అది గులాబీ రంగులో ఉంటుంది. దాన్నే ఇవి ముక్కుతో తీసుకుని ఒళ్లంతా రాసుకుంటాయి. ఆశ్చర్యకరమైన ఈ సంగతికి ముందు అసలు ఫ్లెమింగోల గురించి తెలుసుకోవాలి.
వంపు తిరిగిన ముక్కుతో, సన్నని పొడవైన మెడతో, పొడవైన కాళ్లతో ఉండే ఫ్లెమింగోలు ఎక్కువగా మంచు ప్రదేశాలు, భూమి నుంచి లావా పెల్లుబికే ప్రాంతాల్లోని సరస్సుల్లో కనిపిస్తాయి. అక్కడి జలావాసాల్లో పెరిగే ఒక రకమైన ఆల్గే, సూక్ష్మజీవులను తింటాయి. వాటి ఆహారం వల్లనే వాటికి గులాబీ రంగు ఏర్పడిందని అనుకునేవారు. అయితే ఏడాదిలో కొన్ని నెలల్లో ఎక్కువ రంగుతో, తర్వాత వెలిసిపోయినట్టు ఉండడాన్ని గమనించి పరిశోధన చేశారు.
జతకట్టడానికి ముందు ఇవి తమ గ్రంథుల నుంచి వచ్చే గులాబీరంగు తైలాన్ని పనిగట్టుకుని ఒళ్లంతా రాసుకుంటాయని తేలింది. సాధారణంగా నీటి పక్షులన్నింటికీ తైలగ్రంథులుంటాయి. అయితే ఇవి ఆ తైలం రంగు మారే విధంగా తగిన ఆహారాన్ని తీసుకుంటాయని కనుగొన్నారు. జతకట్టే ముందే ఇలా జరుగుతోందని, తర్వాత మేకప్‌పై అంత శ్రద్ధ చూపడం లేదని గమనించారు.
ఎక్కువ సంఖ్యలో గుంపుగా గడిపే పక్షులుగా ఫ్లెమింగోలకు గిన్నెస్ రికార్డు ఉంది. ఆఫ్రికాలో ఇవి పదిలక్షలకుపైగా ఒకే చోట చేరి కనువిందు చేస్తాయి.
ఫ్లెమింగోలు ఒకే రాత్రిలో 500 కిలోమీటర్లు ప్రయాణించగలవు. దాదాపు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఎగరగలవు.
- ============================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...