Saturday, November 06, 2010

బాణసంచా కద ఏమిటి?, Story of Diwali fireworks?



దీపావళికి మనమందరం కాల్చుకునే టపాసుల వెనుక రెండు ఆసక్తి కరమైన కథలున్నాయి. రెండూ చైనాకి సంబంధించినవే కాబట్టి బాణసంచా పుట్టిల్లు ఆ దేశమే. సుమారు వెయ్యేళ్ల క్రితం చైనాలోని హునాన్‌ ప్రాంతంలో లీ టియస్‌ అనే సాధువు ఉండేవాడు. ఆయనే కొన్ని రసాయనాలతో విచిత్రంగా మండే టపాసుల్ని కనిపెట్టాడని చెబుతారు. ఆయనకు ఒక గుడి కూడా కట్టారు. ఏటా ఏప్రిల్‌ 18న ఆ సాధువుకు పూజలు చేసి టపాసులు కాలుస్తారు. ఇప్పటికీ ప్రపంచంలో ఎక్కువ బాణసంచా ఉత్పత్తి అయ్యేది ఆ సాధువు నివసించిన ప్రాంతమే కావడం విశేషం.
మరో కథ ప్రకారం సుమారు 2000 ఏళ్ల క్రితం చైనాలో ఓ వంటవాడు అనుకోకుండా వీటిని కనిపెట్టాడు. ఓరోజు అతడు మూడు రకాల పొడులను బాణలిపై వేడి చేస్తున్నప్పుడు నిప్పురవ్వ పడి ఆ మిశ్రమం పెద్దగా మెరుపులు చిమ్ముతూ మండిపోయింది. అతడు వాడిన గంధకం, బొగ్గుపొడి, ఒకరకమైన లవణాలను ఇప్పటికీ టపాసుల తయారీలో వాడుతున్నారు. ఆపై ఆ పొడులను వెదురు బొంగుల్లో కూరి మంటల్లో పడేస్తే 'ఢాం' అని పేలేది. అదే బాంబుకి అమ్మమ్మ అన్నమాట. బాణసంచా కాలిస్తే భూతాలు, పిశాచాలు భయపడి పారిపోతాయని చైనీయులు నమ్ముతారు. మార్కోపోలో సముద్రయానం చేస్తూ వాటిని ఇంగ్లండ్‌ తీసుకెళితే అవి అక్కడ బాగా నచ్చాయి. ఎలిజెబెత్‌ రాణిగారైతే ఏటా ప్రదర్శన పెట్టి మంచి టపాసులు కాల్చిన వారికి అవార్డులు కూడా ఇచ్చేవారు. బాణాసంచాను కనువిందు కలిగించే కళగా మార్చింది మాత్రం ఇటాలియన్లే. రసాయనాలను వాడి రంగులు విరజిమ్మేలా చేశారు.

world Records:

* ఫిలిప్పీన్స్‌లో 2010లో 30 సెకన్లలో 1,25,801 తారాజువ్వల్ని వెలిగించి గిన్నెస్‌ రికార్డు నెలకొల్పారు.
* ఇంగ్లండ్‌ బోర్న్‌మోత్‌లో 2009లో 6.5 సెకన్లలో 1,10,000 రకాల బాణసంచా సరుకులు కాల్చారు.
* యూరప్‌లో జరిగే అతి పెద్ద ఫైర్‌వర్స్క్‌ పండగ 'లేక్‌ ఫెస్టివల్‌'. గత 150 ఏళ్లుగా జరిగే దీన్ని చూడ్డానికి లక్షా 50వేల మంది వస్తారు.
* ప్రపంచంలో ఎక్కువ టపాసులు కాల్చే అతి పెద్ద పండగ మన దీపావళే తెలుసా?
* జపాన్‌లో 1988లో తయారు చేసిన అతి పెద్ద చిచ్చుబుడ్డి గిన్నెస్‌ రికార్డుల్లోకి ఎక్కింది. 54.7 అంగుళాల వ్యాసం, 750 కిలోల బరువు ఉండే దీన్ని కాలిస్తే ఆ వెలుగు రవ్వలు 3,937 అడుగుల వ్యాసం వరకు విరజిమ్మాయి.

  • ================================
visit My website > Dr.Seshagirirao - MBBS.http://dr.seshagirirao.tripod.com/

No comments:

Post a Comment

your comment is important to improve this blog...