ప్రశ్న: కొబ్బరి నీళ్లు శరీరానికి మేలు చేస్తాయంటారు. ఎందువల్ల?
-ఎమ్. సీత, 10వ తరగతి, కొండపల్లి (కృష్ణా)
జవాబు: కొబ్బరి నీళ్లు నిజానికి కొబ్బరి మొలకల ఎదుగుదలకు కావలసిన ఆహారాన్ని ద్రవరూపంలో అందించడానికి ఏర్పడినవి. పారదర్శకంగా ఉండే తీయని కొబ్బరి నీళ్లలో నూనె, చక్కెర, నీరు, విటమిన్లు, పొటాషియం, భాస్వరం, సెలీనియం లాంటి పోషక పదార్థాలతో కూడిన ఖనిజ పదార్థాలుంటాయి. ఆ నీళ్లు తాగితే ఇవన్నీ శరీరానికి అందినట్టే. కొబ్బరి కాయ ముదిరే కొద్దీ లోపల ఉండే కొబ్బరి ఆ నీళ్లను పీల్చుకుంటుంది. అందువల్లనే ముదురుకాయలో కన్నా లేతకాయలో నీళ్లు ఎక్కువగా ఉంటాయి. కొబ్బరి నీరు క్రిమిరహితమైన పరిశుభ్రమైన ద్రవం కావడంతో వాటిని తాగడం మంచిదని వైద్యులు చెబుతుంటారు. సాధారణంగా రక్తస్రావం ఎక్కువై శరీరంలోని సీరం చాలా తక్కువైన సందర్భాల్లో వైద్యులు కొబ్బరి నీళ్లను తాగమని సూచిస్తారు. మూత్రపిండ వ్యాధులున్నవారికి, వాంతులవుతున్నవారికి, రక్తపీడనం ఎక్కువగా ఉన్నవారికి, చర్మం పొడిబారిపోయి ముడతలు పడుతున్నవారికి, గ్లూకోమాలాంటి కంటి జబ్బులున్నవారికి కొబ్బరి నీళ్లు ఎంతో మేలు చేస్తాయి.
-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- =================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...