పిల్లలందరికీ ఇష్టమైనది... ప్రతి ఇంటా కొలువైనది... అదే అందాల టెడ్డీబేర్ ఆ బొమ్మ.మీ ఇంట్లో టెడ్డీ బేర్ బొమ్ముందిగా? మరి దాని వయసు మీ ఇంట్లో వాళ్లందరి వయసుకన్నా ఎక్కువంటే నమ్మగలరా? నిజమే. దాని వయసు 125 ఏళ్లు!
టెడ్డీబేర్ బొమ్మ పుట్టుకకు కారణమైన కార్టూన్ ఇదే
అసలు టెడ్డీబేర్‌కు ఆ పేరు, అమెరికా అధ్యక్షుని వల్ల వచ్చిందని తెలుసా? దాని వెనకాల ఓ కథ ఉంది. అమెరికా అధ్యక్షుడిగా థియోడర్ రూజ్‌వెల్ట్ ఉన్నప్పటి కథ ఇది. ఓ రోజు ఆయన వేటకు వెళ్లారు. తుపాకితో దేన్ని కాలుద్దామా ఆని చూస్తున్నంతలో అనుచరులు ఓ ఎలుగుబంటిని చూపించారు. తీరా గురి పెట్టి చూసేసరికి అదొక పిల్ల ఎలుగు పాపం. దాన్ని చూడగానే ఆయనకి జాలేసింది. కాల్చకుండా దాన్ని వదిలేశారు. ఈ సంఘటనపై ఆ మర్నాడు ఓ దిన పత్రికలో కార్టూన్ వచ్చింది. అందరికీ అది తెగ నచ్చేసింది. దాంతో దాన్ని ఎన్నో పత్రికలు ప్రచురించాయి. అలా బోలెడు ప్రచారం జరిగింది. న్యూయార్క్‌లోని ఓ బొమ్మల దుకాణం నడిపే ఒకావిడ ఆ కార్టూన్‌లో వేసిన ఎలుగుబంటిలాగానే జాలి ముఖం ఉండేలా ఓ దూది బొమ్మను తయారు చేసింది. దాన్ని అధ్యక్షుడికి పంపి, 'దీనికి మీ పేరు పెట్టుకోవచ్చా?' అని లేఖ రాసింది. దానికి ఆయన 'సరే...' అని జవాబు పంపారు. ఆయనకి టెడ్డీ అనే మరో వాడుకపేరు ఉండేది. కాబట్టి ఆవిడ తన షాపులో ఈ బొమ్మలు తయారు చేసి 'టెడ్డీబేర్' అని పేరు పెట్టారు. అలా టెడ్డీబేర్ బారసాల జరిగిందన్నమాట. ఆపై టెడ్డీ బేర్ బొమ్మలు విపరీతంగా అమ్ముడయ్యాయి. అప్పటినుంచి దేశదేశాల్లో పిల్లలకు ఇది ఎంతో ఇష్టమైపోయింది. టెడ్డీబేర్ మ్యూజియంలు కూడా ఎన్నో దేశాల్లో ఉన్నాయి.
మీకు అతి ఖరీదైన టెడ్డీ బేర్ గురించి తెలుసా? దాన్ని కొనాలంటే డాడీని 86 లక్షల రూపాయలు అడగండి. ఎందుకంత ధరంటే... దీంట్లో వజ్రాలు, బంగారం లాంటి విలువైన వస్తువుల్ని పొదిగారు. దీనికి మరో రికార్డు కూడా ఉంది. ఇది ప్రపంచంలోని ఏడు ఖరీదైన బొమ్మల్లో ఒకటి. జర్మనీకి చెందిన స్టీఫ్ కంపెనీ టెడ్డీబేర్ బొమ్మల్ని తయారు చేయడం మొదలెట్టి 125 ఏళ్లయిన సందర్భంగా ప్రత్యేకంగా 125 బొమ్మల్ని తయారు చేసింది.
మీకు తెలుసా?
* 2009లో దక్షిణ కొరియాలో 33 అడుగుల పొడవు, 7.5 అడుగుల వెడల్పుతో ప్రపంచంలోనే అతి పెద్ద టెడ్డీబేర్‌ను రూపొందించారు. ఇక అతి చిన్న టెడ్డీబేర్ కూడా కొరియా మ్యూజియంలో ఉంది. దీని పరిమాణం కేవలం 4.5 మిల్లీమీటర్లు.
* అమెరికాకు చెందిన జాకీ అనే మహిళ 5,029 రకాల టెడ్డీ బేర్‌లను సేకరించి రికార్డు సృష్టించింది.
- =========================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...