ప్రశ్న: నక్షత్రాలు, గ్రహాలు ఎలా ఏర్పడ్డాయి?
- ఈమని నీలిమ, 10వ తరగతి, హైదరాబాద్
జవాబు: అతి చల్లని, భారీ హైడ్రోజన్ వాయువు మేఘం నక్షత్రం పుట్టుకకు నాంది పలుకుతుంది. దాని ఉష్ణోగ్రత పరమ ఉష్ణోగ్రత (-273.13 డిగ్రీల సెంటీగ్రేడ్) కన్నా ఒకటి, రెండు డిగ్రీలు ఎక్కువ ఉంటుందంతే. ఆ మేఘం గురుత్వాకర్షణ బలం వల్ల దానిలోకి అదే కుచించుకు పోవడం మొదలు పెడుతుంది. ఈ ప్రక్రియలో పదార్ధాల కణాలు ఉత్పన్నమయి, అవి అత్యంత వేగాన్ని సంతరించుకుని వాటిలోకి అవే చొచ్చుకుపోవడం ప్రారంభిస్తాయి. ఫలితంగా వాయువు ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుంది. ఉష్ణోగ్రత అత్యధికంగా పెరిగిన తర్వాత ఆ మేఘం మెరుస్తూ, ఉష్ణ వికిరణాలను, కాంతిని వెదజల్లుతుంది. ఈ దశలో ఈ వికిరణాలను పరారుణ (Infrared) టెలిస్కోపులతో కనిపెట్టవచ్చు. క్రమేణా ఆ మేఘంలోని సాంద్రత, ఉష్ణోగ్రత ఎంతగా పెరుగుతాయంటే, అందులో కేంద్రక సంలీనం (Nuclear Fusion) సంభవిస్తుంది. ఈ క్రమంలో హైడ్రోజన్ వాయువు హీలియం వాయువుగా మారుతుంది. అంటే, ఒక నక్షత్రం జన్మించిందన్న మాట. ఒక హైడ్రోజన్ మేఘం నుంచి వివిధ పరిమాణాలున్న నక్షత్రాలు ఉద్భవిస్తాయి. కొన్ని సార్లు వేలాది, లక్షలాది నక్షత్రాల సమూహం ఒకేసారి ఏర్పడుతుంది. నక్షత్రాలుగా ఏర్పడిన తర్వాత ఆ మేఘంలో మిగిలిన భాగం వాయువు, ధూళిరూపంలో ఆ నక్షత్రాల చుట్టూ తిరగడం మొదలవుతుంది. అలా తిరుగుతూ పదార్థ రూపంలోకి మారి, ఆ పదార్థపు కణాలు ఒకదానికొకటి దగ్గరై క్రమేపీ పరిమాణం పెరుగుతూ గ్రహాలుగా ఏర్పడుతుంది. ఆపై ఆ గ్రహాలు శాశ్వతంగా ఆయా నక్షత్రాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి.
ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- ================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...