Saturday, November 27, 2010

కళ్లకు ఆ రంగెలా వస్తుంది ?, How eyes get that color ?





ప్రశ్న: కొందరి కళ్లు నీలం రంగులో ఉంటాయి. ఎందుకు?

- ఎస్‌. సలీం, 9వ తరగతి, అనంతపురం

జవాబు: కంటి గుడ్డులోని వర్ణకాలు (Pigments) కంటి రంగును నిర్ణయిస్తాయి. మెలానిన్‌ అనే జీవ రసాయన ద్రవ పదార్థ పరిమాణాన్ని బట్టి కంటి రంగు లేత నీలం రంగు నుంచి ముదురు గోధుమ రంగు వరకు ఉంటుంది. తల వెంట్రుకలు తెల్లగానో, బంగారు రంగులోనో ఉండే పాశ్చాత్యుల కళ్లు ఈ మెలానిన్‌ను తక్కువ శాతంలో ఉత్పన్నం చేస్తాయి. అందువల్ల వారి కంటి గుడ్డుపై పతనమయ్యే కాంతి నుండి నీలం రంగు ఎక్కువగా పరావర్తనం చెందుతుంది. అందువల్ల వారి కళ్లు నీలం రంగులో కనపడతాయి. మెలానిన్‌ పరిమాణం ఎక్కువయ్యే కొలదీ కంటి రంగు పరిధి ఆకుపచ్చ నుంచి గోధుమరంగు వరకు ఉంటుంది.

కంటి రంగును జన్యువులు కూడా నిర్ణయిస్తాయి. ఈ విషయమై శాస్త్రజ్ఞులు ఇంతవరకు ఒక కచ్చితమైన అభిప్రాయానికి రాకపోయినా, ప్రపంచంలో నీలం రంగు కన్నా, ఆకుపచ్చరంగు, ముదురు గోధుమ రంగు కళ్లు ఉండే వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. నీలం రంగు కళ్లు కలవారు ఉత్తర ఐరోపాలో ఎక్కువగా ఉంటే, మిగతా ప్రపంచంలో గోధుమరంగు కళ్లు కలవారే ఎక్కువ. ప్రతి పదిలక్షల మందిలో ఒకరికి కుడి కన్ను ఒక రంగులో ఉంటే, ఎడమకన్ను మరో రంగులో ఉంటుంది.జన్యుపరంగా వచ్చే ఈ పరిస్థితిని 'హైడ్రో క్రోమియా' అంటారు.

- ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైద్రాబాద్‌


  • ===================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...