Thursday, June 24, 2010

కొండల్లో రీసౌండ్‌ వస్తుందేం? , Mountains give re-sound - why?






ప్రశ్న: కొండ ప్రాంతంలో అరిస్తే కాసేపటికి మళ్లీ మనకే వినిపిస్తుందేం?

జవాబు: ధ్వనితరంగాలు గాలిలో సుమారు సెకనుకు 332 మీటర్లు వేగముతో ప్రయానిస్తాయి.  కొండల ముందు గట్టిగా అరిస్తే కొన్ని సెకన్ల తర్వాత ఆ అరుపులే మనకి వినిపిస్తాయి. దీన్నే ప్రతిధ్వని (echo)అంటారు. ధ్వని తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది. శబ్దస్థానం నుంచి ధ్వని తరంగాలు అన్ని దిశలకు వ్యాపిస్తాయి. వీటికి ఏదైనా అడ్డంకి ఏర్పడినప్పుడు ఆ శబ్ద తరంగాలలో కొన్ని పరావర్తనం చెందుతాయి. అలా తిరిగి వెనక్కి వచ్చే శబ్ద తరంగాలనే మనం వింటాం. నిజానికి ప్రతి శబ్దం ఏదో ఒక అడ్డంకిని తాకి తిరిగి వెనక్కి వచ్చినప్పటికీ అన్నింటినీ మనం వినలేం. ఒక సెకనులో పదో వంతు లోపల తిరిగి వచ్చే ప్రతిధ్వనులను వినలేం. అంటే ప్రతిధ్వని మనకి వినబడాలంటే మన నుంచి బయల్దేరిన శబ్దతరంగాలు 1/10 సెకన్లకు మించిన వ్యవధితో తిరిగి రావాలి. ఆ విధంగా లెక్క కట్టినప్పుడు శబ్దతరంగాలను పరావర్తనం చేసే అడ్డంకి మనకు కనీసం 17 మీటర్ల దూరంలో ఉండాలని తేలుతుంది. పైగా మధ్యలో ఎలాంటి ఇతర అడ్డంకులు ఉండకూడదు. ఈ పరిస్థితులు కొండ ప్రాంతాలు, పెద్ద పెద్ద దేవాలయాలు, ఖాళీ గదులు, లోతైన బావుల దగ్గర ఉంటుంది కాబట్టి, ఆయా ప్రాంతాల్లో మన అరుపులు తిరిగి ప్రతిధ్వనులుగా మనకే వినిపిస్తాయి. మనం ప్రతిధ్వనిని వినే వ్యవధి మనకు, అడ్డంకికి మధ్య ఉండే దూరాన్ని బట్టి ఉంటుంది.
  • ==============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...