జవాబు: విపరీతమైన జన్యులక్షణాలు, గర్భస్థ సమయంలో పిండంలో కలిగిన మార్పుల మూలాన ప్రపంచంలో అత్యంత పొడవైన వ్యక్తిగా సుమారు ఎనిమిది అడుగుల 3 అంగుళాల ఎత్తుగల సుల్తాన్ కోసెన్ గిన్నిస్ రికార్డుకెక్కాడు. ప్రపంచంలో నేటి వరకు రికార్డు ప్రకారం అత్యంత పొట్టి వ్యక్తి నేపాల్ దేశానికి చెందిన చంద్ర బహద్దూర్ డాంగీ. ఇతని ఎత్తు కేవలం ఒక అడుగు తొమ్మిదిన్నర అంగుళాలు. ఇలాంటి విపరీతమైన వ్యత్యాసాలు మినహాయిస్తే సాధారణ ప్రజానీకంలో ఎత్తు పొడవులు తేడా ఉండటానికి చాలానే కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనవి, అప్రధానమైనవి ఉన్నాయి. అప్రధానమైనవి అరుదుగా సంభవించే కారణాలు. ఉదాహరణకు గర్భంలో ఉండగా తల్లి సరిగా ఆహారం తీసుకోనట్లయితే పిండం ఎదుగుదలలో లోపం వచ్చి ఆ తర్వాత ఎంత తిన్నా పొడవు పెరగక పోవచ్చు. ఒక వేళ మామూలుగానే తల్లి ఆరోగ్యంగా గర్భం ధరించినా ప్రసవం తర్వాత నూతన శిశువుకు బాలారిష్టాలు కల్గి ఎముకల ఎదుగుదలలో లోపాలు వచ్చినా, పెరిగే క్రమంలో పోషకాహారం లేకున్నా, బాల్యంలోనే ఎదుగుదల క్షీణించవచ్చు. మనిషి సుమారు 20 సంవత్సరాల లోపే ఎదుగుతాడు. ఆ తర్వాత ఎదుగుదల ఉండదు. కాబట్టి 20 సంవత్సరాల లోపు పోషకాహారం, వ్యాయామం, మంచి నిద్ర అవసరం.
ప్రధానమైన కారణాలు జన్యు సంబంధమైనవి. ఉదాహరణకు తల్లిదండ్రులు ఇరువురూ పొడవుగా ఉన్నట్లయితే పిల్లలు కూడా పొడవుగానే ఎదిగే అవకాశం ఉంది. చైనా, జపాన్, నేపాల్, మలేషియా వంటి ప్రాంతాల్లో ప్రజల జన్యుతత్వం అక్కడ సగటు మనిషి ఎత్తు 5 అడుగుల వరకే ఉండేలా ఉంది. అమెరికా, దక్షిణాఫ్రికా, కెనడా, రష్యా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో అలాంటి జన్యుతత్వం లేదు.
సాధారణంగా వారు 6 అడుగుల వరకు పెరుగుతారు. భారతీయులు సగటుగా 5 నుంచి 6 అడుగుల మధ్య ఉంటారు. అత్యంత పొడవుకు కూడా జన్యువులే కారణం.
- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; కన్వీనర్, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
- ========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...