Wednesday, December 24, 2014

పాదరసం నీటిలో కరగదు-కలవదు.ఎందువల్ల?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: పాదరసం నీటిలో కరగదు-కలవదు.ఎందువల్ల?

జవాబు: భూమిపై ఉన్న వందకుపైగా మూలకాల్లో సాధారణ ఉష్ణోగ్రతా పీడనాల దగ్గర ద్రవస్థితిలో ఉన్నవి రెండే రెండు. ఒకటి బ్రోమిన్‌. ఇది అలోహం (non metal) , రెండోది పాదరసం. ఇది లోహం. అరచేతిలో పెట్టుకొంటే ద్రవంగా మారే రుబిడియం, ఫ్రాన్షియం, గెలియం వంటి ఇతర లోహాలు ఉన్నాయి. మూలకాలకు స్వతహాగా ధ్రువత్వం (polarity) ఉండదు.

ఒకే కణానికి విద్యుదావేశం ఉంటే వాటిని అయానులు అంటారు. ఉదాహరణకు (Nacl) ఉప్పులో సోడియం కణానికి ధనావేశం ఉంటుంది. ఒక కణంలో ఓ ప్రాంతంలో ధనావేశ లక్షణం, మరో ప్రాంతంలో రుణావేశ లక్షణం ఉంటే అటువంటి పదార్థాలను ధ్రువపదార్థాలు (polar materials) అంటారు. ఉదాహరణకు అమ్మోనియో (NH3) అణువులో నత్రజని పరమాణువు ప్రాంతంలో రుణావేశితం స్వల్పంగా పోగయి ఉంటుంది. హైడ్రోజన్‌లున్న ప్రాంతంలో స్వల్పంగా ధనావేశం పోగయి ఉంటుంది. అందుకే ఆ అణువును ధ్రువాణువు అంటారు. పూర్తిగాగానీ లేదా పాక్షికంగానైనా గానీ విద్యుదావేశం అదనంగా లేని పరమాణువుల్ని అణువుల్ని, పదార్థాల్ని మనం అధ్రువ పదార్థాలు అంటాం. అయస్కాంత పదార్థాలు అయస్కాంత లక్షణాలున్న పదార్థాలతోనే ప్రభావితమైనట్లే, విద్యుదావేశమున్న పదార్థాలు ఇతర విద్యుదావేశిత పదార్థాలతోనే ప్రభావితమవుతాయి. నీటి అణువు H2o కూడా ధ్రువ అణువు. ఆక్సిజన్‌ దగ్గర రుణావేశం, హైడ్రోజన్ల దగ్గర ధనావేశం స్వల్పంగా పోగయి ఉంటాయి. కాబట్టి నీటిని ధ్రువద్రావణి అంటారు. అందువల్ల అయాను లక్షణాలున్న ఉప్పు, ధ్రువ లక్షణాలున్న చక్కెర, ఆల్కహాలు వంటివి నీటిలో బాగా కరుగుతాయి, కలుస్తాయి. పాదరసానికి ధ్రువ లక్షణం లేకపోవడం వల్ల నీటిలో కరగదు. కలవదు.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; జనవిజ్ఞానవేదిక, శాస్త్రప్రచార విభాగం (తెలంగాణ)

 

  • ========================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

No comments:

Post a Comment

your comment is important to improve this blog...