రేడియో ధార్మికత అంటే ఏమిటి? అది ఏ పదార్థాల్లో ఉంటుంది? దాని వల్ల ఉపయోగమేమిటి? దీనిని ఎవరు కనిపెట్టారు?
జవాబు:
విశ్వంలో మొదట ప్రాథమిక కణాలు (elementary particles) ఏర్పడ్డాయి. వాటిలో ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు ప్రధానమైనవి. ఇవి ఒక బృందంగా ఏర్పడడం వల్ల పరమాణువులు, వాటిలో ఒకే తరహా పరమాణువులు కలవడం వల్ల మూలకాలు (elements), వేర్వేరు మూలకాల కలయిక వల్ల సంయోగపదార్థాలు (compounds) ఏర్పడ్డాయి. సాధారణంగా మనం చూసే ప్రపంచం ఈ మూలకాలు, సంయోగపదార్థాల సమాహారమే. ఇక పరమాణువుల కేంద్రకాల్లో ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఉంటాయని చదువుకుని ఉంటారు. ఈ కణాల సంఖ్య తక్కువైనా, మరీ ఎక్కువైనా స్థిరత్వం ఉండదు. ఎక్కువ పరిమాణం ఉండే కేంద్రకాలకు అస్థిరత్వం ఎక్కువ. కేంద్రకంలో న్యూట్రాన్లు, ప్రోటాన్లు ఒక పరిమితికి మించి ఎక్కువైతే ఆ కేంద్రకాలు చిన్న చిన్న కేంద్రకాలుగా మారే ప్రయత్నం చేస్తాయి. ఆ ప్రయత్నంలో ఆయా కేంద్రకాల నుంచి ఆల్ఫా కణాలను, ఎలక్ట్రాన్లను (బీటా కణాలు), కొంత శక్తిని గామా కిరణాల రూపంలోనూ పోగొట్టుకుంటూ స్థిరమైన కేంద్రకాలుగా మారతాయి. ఈ ప్రక్రియనే రేడియో ధార్మికత (Radioactivity) అంటారు. ఈ విషయాన్ని 1896లో హెన్రీ బెకెరల్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. అణు విద్యుత్ ఉత్పాదనలోను, వైద్య రంగంలోను, పంటల రోగ నిరోధక శక్తిని పెంచే ప్రక్రియల్లోను రేడియో ధార్మికత ఎంతో ఉపయోగపడుతోంది.
==========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.
No comments:
Post a Comment
your comment is important to improve this blog...