ప్రశ్న:
ఉల్కలు భూమి మీదకు ఎలా వస్తాయి? ఎక్కడ నుండి వస్తాయి?
జవాబు:
ఆకాశంలో రాత్రి వేళల్లో కొన్ని మెరుస్తున్న పదార్థాలు జారి పడుతూ నక్షత్రాల్లా కనిపిస్తాయి. వీటిని రాలే నక్షత్రాలు (falling stars) లేదా దూసుకుపోయే నక్షత్రాలు (shooting stars) అంటారు. కానీ అవి నక్షత్రాలు కానేకావు. ఉల్కలు. నక్షత్రాలు అలా వూడి పడవు. గ్రహాలు ఏర్పడిన తొలి రోజుల్లో వాటి ఆకర్షణకు లోనుకాని కొన్ని శిలలు, ధూళి కణాలు విడివిడిగా మిగిలిపోయాయి. గ్రహాల్లాగానే ఇవి కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి. అలాగే తోక చుక్కల తోక భాగం లోని మంచు ముక్కలు, శిలా శకలాలు వాటి నుంచి వేరయి అంతరిక్షంలో పరిభ్రమిస్తుంటాయి. అలాగే అంగారక గ్రహం, చంద్రుని నుంచి వెలువడిన ధూళి కణాలు కూడా అంతరిక్షంలో ఉంటాయి. వీటన్నింటినీ 'మెటియోరైడ్స్' అంటారు. భూమి తన కక్ష్యలో తాను తిరుగుతూ ఇవుండే ప్రాంతాలకు వచ్చినప్పుడు వీటిలో కొన్ని భూమ్యాకర్షణ శక్తికి లోనై భూవాతావరణంలోకి గంటకు 30,000 కిలోమీటర్ల వేగంతో దూసుకువస్తాయి. ఆ వేగం వల్ల వాటి ఉష్ణోగ్రత సుమారు 1650 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు పెరుగుతుంది. ఇవి భూవాతావరణంలోకి దూసుకు వచ్చేప్పుడు గాలిపై తీవ్రమైన ఒత్తిడిని కలుగజేస్తాయి. దాంతో గాలి వేడెక్కుతుంది. ఆ ఉష్ణాన్ని గ్రహించిన మెటియోరైడ్ కాంతిని వెదజల్లే ఉల్కగా మారి పడిపోతుంది.
- ==================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...