ఆకాశంలో మేఘాలు రకరకాల ఆకారాలుగా కనిపిస్తేనే సంబరపడతాం. అలాంటిది వేలాది ఎకరాల్లో విస్తరించిన ప్రదేశంలో శిలలన్నీ అద్భుతమైన రూపాల్లో ఉంటే ఎలా ఉంటుంది? అలా అబ్బురపరిచే ప్రాంతమే అమెరికాలోని ఆర్చెస్ నేషనల్ పార్కు. అక్కడ ఎటు చూసినా కనిపించేది సాండ్‌స్టోన్ పరుచుకున్న ప్రదేశమే. ఇదంతా కోట్లాది ఏళ్లుగా ప్రకృతిలో ఏర్పడిన మార్పుల వల్ల రకరకాల ఆకారాలను సంతరించుకుని ఆశ్చర్యపరుస్తూ కనిపిస్తాయి. కొన్ని గుడి గోపురాల్లా ఉంటే, మరి కొన్ని చర్చి శిఖరాల్లా ఉంటాయి. ఇక పుట్టలు, మెలికలు తిరిగే వంపులు, గుమ్మటాల్లాంటివెన్నో రూపాలు కనిపిస్తాయి. మీకు సహజ శిలా తోరణమంటే తెలుసుగా? ఒకే శిల ఈ వైపు నుంచి ఆ వైపు వరకు ఒక తోరణంలా, వంతెనలా ఏర్పడడం. ఇలాంటి శిలాతోరణాలు ఇక్కడ ఏకంగా రెండువేలకు పైగా కనిపిస్తాయి. అందుకే దీన్ని ఆర్చెస్ నేషనల్ పార్క్ అంటారు. ఇక్కడుండే శిలాతోరణాల్లో అతి పెద్దది ఏకంగా 290 అడుగుల వరకు వెడల్పుతో ఉంటే, చిన్నవి మూడు అడుగుల వెడల్పుతో చూడముచ్చటగా ఉంటాయి.
అమెరికాలోని ఉతా (Utah)లో విస్తరించిన ఈ అందాల ప్రదేశం విస్తీర్ణం ఎంతో తెలుసా? 76 వేల ఎకరాల పైనే. దాదాపు 30 కోట్ల ఏళ్ల కిత్రం ఈ ప్రదేశమంతా సముద్రంతో నిండి ఉండేదని చెబుతారు. ఆ సముద్రం భౌగోళిక మార్పుల వల్ల ఇగిరిపోయింది. అందుకనే ఇక్కడి భూగర్భమంతా ఉప్పు మేటలు, ఇసుకరాతి శిలలతో కూడి ఉంటుంది. క్రమంగా ఇవి గట్టిపడిపోయి సాండ్‌స్టోన్ గుట్టలుగా మారింది. కాలక్రమేణా గాలులు, వర్షాల కోత వల్ల ఈ శిలలన్నీ వింత ఆకారాల్లోకి మారిపోయాయన్నమాట.
ఇక్కడి శిలాతోరణాల్లో డెలికేట్ ఆర్చ్ ఎంతో అందమైనదిగా పేరొందింది. 52 అడుగుల ఎత్తుతో ఉండే ఈ తోరణంలో నుంచి 2002లో శీతాకాల ఒలింపిక్స్ టార్చిని పట్టుకెళ్లారు. గతంలో ఈ ఆకారాలపైకి రాక్ క్త్లెంబింగ్‌కు అనుమతి ఇచ్చేవారు. కానీ అవి దెబ్బతింటున్నాయన్న కారణంగా వీటిపైకి ఎక్కనివ్వడంలేదు. 1929 నుంచి ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా ప్రకటించింది. ఏటా సుమారు 8 లక్షల పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు.
==============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.
No comments:
Post a Comment
your comment is important to improve this blog...