Friday, April 23, 2010

ఆకాశం నీలమేల? , Sky is Blue-Why?





ప్రశ్న:
ఆకాశం నీలం రంగులో ఎందుకు ఉంటుంది?
జవాబు:
తెల్లని సూర్యకాంతిలో ఊదా, నీలి, ఆకుపచ్చ, పసుపు, నారింజ, ఎరుపు రంగులు కలిసి ఉంటాయని చదువుకునే ఉంటారు. వివిధ రంగుల కాంతి కిరణాలు వేర్వేరు తరంగదైర్ఘ్యాలు (wave lengths) కలిగి ఉంటాయి. ఊదారంగుకు అతి తక్కువ తరంగదైర్ఘ్యం ఉంటే, ఎరుపు రంగు తరంగదైర్ఘ్యం అన్నింటికన్నా ఎక్కువ. కాంతి కిరణాలు భూవాతావరణంలోని నైట్రోజన్‌, ఆక్సిజన్‌, ధూళి కణాలపై పడినప్పుడు నీలం రంగు ఎక్కువగా పరిక్షేపణం (scattering) చెందుతుంది. అంటే నీలం రంగు ఎక్కువగా చెదురుతుందన్నమాట. తరంగదైర్ఘ్యం తక్కువ కావడం వల్ల నీలవర్ణ తరంగాలు వాతావరణంలోని ఎక్కువ అణువులతో ఢీకొని, ఎరుపు రంగుకన్నా ఎక్కువగా చెదురుతాయి. ఇలా చెదిరిన నీలమే మనకు ఆకాశంగా కనిపిస్తుంది. నిజానికి నీలం కన్నా ఊదారంగు తరంగదైర్ఘ్యం ఇంకా తక్కువ. ఆ ప్రకారం చూస్తే ఆకాశం ఊదారంగు (violet) రంగులోనే కనిపించాలి. అలా ఎందుకు కనిపించడం లేదంటే తెల్లని సూర్యకాంతిలో ఊదా కంటే నీలం రంగు పాలు ఎక్కువగా ఉండడమే. అంతే కాకుండా మన కంటికి ఊదా రంగు కన్నా, నీలం రంగును గుర్తించే శక్తి ఎక్కువగా ఉంది. సూర్యుడు అస్తమించే సమయంలో ఆకాశం మరీ నీలంగా ఉంటుంది. దీనికి కారణం వాతావరణం పైపొరలోని ఓజోన్‌ అస్తమిస్తున్న సూర్యకాంతిలోని ఎరుపు రంగును పూర్తిగా పీల్చేసుకోవడమే.


  • ===============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...