రాత్రివేళల్లో అప్పుడప్పుడు చంద్రుడి చుట్టూ వలయాలు కనిపిస్తాయి. అవి చూసిన పెద్దవాళ్లు చంద్రుడు గుడి కట్టాడంటారు. దీనికి కారణం ఏమిటి?
జవాబు:
చంద్రుడి చుట్టూ అలా ఏర్పడే వలయాన్ని ఇంగ్లిషులో 'హాలో' అంటారు. కొన్ని ప్రాంతాల్లో దీన్నే వరదగుడి అంటారు. వాతావరణంలో మంచు స్ఫటికాలతో కూడిన మేఘాలు ఉన్నప్పుడు, వాటి ద్వారా చంద్రుని కాంతి ప్రసరించినప్పుడు ఈ వలయం ఏర్పడుతుంది. అలాంటి మేఘాల్లో సాధారణంగా ఆరుముఖాలున్న సూక్ష్మమైన మంచు స్ఫటికాలు ఉంటాయి. వీటి గుండా వెళ్లే చంద్రుని కాంతి కిరణాలు వక్రీభవనం (refraction) చెందితే, వీటి ఉపరితలంపై పడిన కాంతి పరావర్తనం (reflection) చెందుతుంది. వక్రీభవనం వల్ల చంద్రకాంతి విశ్లేషణ చెంది రంగురంగులాగా కనిపిస్తుంది. పరావర్తనం చెందిన కాంతి తెల్లని రంగులోనే వలయంలాగా ఏర్పడుతుంది. సాధారణంగా చంద్రకాంతి ఆ మంచు స్ఫటికాలపై 22 డిగ్రీల కోణంలో పడుతుంది కాబట్టి, అంతే వ్యాసం ఉండే వలయం చంద్రుని చుట్టూ ఏర్పడుతుంది. వలయం లోపలివైపు ఎరుపురంగు, బయటివైపు నీలం రంగు ఉంటాయి. ఈ వలయం ఏర్పడినప్పుడు వర్షం కరిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మేఘాల్లోని మంచుస్ఫటికాలు ద్రవీభవించి చినుకుల్లా కురిసే అవకాశం ఉంది కదా!
- =========================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...