Tuesday, April 20, 2010

ఆ పీడనాల పదాలేమిటి? , Atmosphearic Pressures meanig ?




ప్రశ్న:

వాతావరణానికి సంబంధించి అల్పపీడన ద్రోణి, వాయుగుండం వల్ల భారీ వర్షాలు అని చెబుతుంటారు. అంటే ఏమిటి?

జవాబు:
గాలులు ఎక్కువగా గుమిగూడి ఉంటే ఆ ప్రాంతంలో అధిక పీడనమనీ, పల్చగా ఉండే ప్రాంతంలో అల్పపీడనమనీ అనుకోవచ్చు. గాలులు నిరంతరం కదులుతూ ఉండడం వల్ల ఈ రెండు పీడనాలూ ఏర్పడుతూనే ఉంటాయి. గాలులు కిందకీ, పైకీ పయనిస్తుంటాయి. ఒక ప్రాంతంలో గాలులు చాలా నెమ్మదిగా దిగుతుంటే అక్కడ అధిక పీడనం ఉందనుకోవచ్చు. అలా దిగిన గాలులు వేడెక్కి తిరిగి పైకి వెళతాయి. భూమిని ఆనుకుని ఉన్న గాలి వేడెక్కినప్పుడు అది వ్యాకోచించి తేలికవుతుంది. అలా తేలికైన గాలులు పైకి ప్రయాణిస్తాయి. అవి పైకి వెళ్లడంతో ఆ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడుతుంది. అందువల్ల వేరే ప్రాంతాల్లో ఉండే గాలులు ఆ ప్రాంతం వైపు వేగంగా కదులుతాయి. వేడెక్కి పైకి బయల్దేరిన గాలులు భూమి వాతావరణం పైపొరల్లోకి వెళ్లేకొద్దీ చల్లబడుతుంది. దాని వల్ల ఆ గాలిలోని నీటి ఆవిరి ఘనీభవించి సూక్ష్మబిందువులు, మంచు స్ఫటికాలుగా మారతాయి. ఈ గాలుల కదలికల వల్ల ఒకోసారి ఆ ప్రాంతంలో సుడులు ఏర్పడుతాయి. సుడుల వల్ల గాలి కదలికలు మరింత తీవ్రమై ఎక్కువ గాలి పోగుపడడం, పైకి వెళ్లే గాలులు చల్లబడి పెద్ద పెద్ద మేఘాలుగా ఏర్పడడం జరుగుతుంది. అందువల్లనే అల్పపీడనం ఏర్పడిన ప్రాంతాల్లో వర్షాలు బాగా కురుస్తాయి. అల్ప పీడనం మరీ తీవ్రంగా మారిపోతే దాన్ని వాయుగుండం అనీ, అది ఇంకా బలపడితే తుపాను అనీ అంటారు. అల్ప పీడనాలు అన్ని ప్రాంతాల్లో ఏర్పడినా, సముద్రాల మీద వాటికి ఎలాంటి అడ్డంకులు ఉండని నేపథ్యంలో గాలుల అలజడి తీవ్రమై, సుడుల్లాగా మారే అవకాశాలు ఎక్కువ. అందువల్లనే తుపానులు కేవలం సముద్రాల్లోనే ఏర్పడుతూ ఉంటాయి. సముద్రాలు వెడెక్కిన కొద్దీ నీటి ఆవిరి ఏర్పడుతుంది. ఇదంతా గాలుల సుడుల వల్ల పైకి పోయి బాగా చల్లబడి మేఘాలుగా మారతాయి. ఈ సుడులు తీరాన్ని తాకగానే చెదరిపోవడంతో మేఘాలు చెల్లాచెదరై ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. మనకు వినిపించే రకరకాల పేర్లనీ ఆ గాలుల కదలికల తీవ్రతను తెలియజెప్పేవే.



-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
  • ============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...