ఓ పెద్ద కొండ. దాని అంచున ఎత్తయిన దిమ్మ. దానిపై నిలబడి చేతులు రెండు వైపులా చాచిన ఓ పెద్ద క్రీస్తు విగ్రహం. ఆర్ట్‌డికో పద్ధతిలో పోతపోసిన విగ్రహాల్లో ఇది ప్రపంచంలోనే ఎత్తయినది. ఆ మధ్య కొత్తగా ప్రకటించిన ఏడు ప్రపంచ కొత్త వింతల్లో ఇది కూడా ఒకటి. ఇదెక్కడుందో తెలుసా? బ్రెజిల్‌లోని రియోడిజనీరోలో ఓ కొండ మీద. ఆ కొండే 2296 అడుగుల ఎత్తుగా ఉంటుంది. దాని మీద సుమారు 30 అడుగుల ఎత్తయిన దిమ్మ. ఆ దిమ్మపై సుమారు 100 అడుగుల విగ్రహం. దీని వెడల్పు 98 అడుగులు. అందుకే ఈ భారీ విగ్రహం ఆ చుట్టుపక్కల వందల కిలోమీటర్ల దూరం నుంచి కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇంతకీ ఈ విగ్రహం పేరేంటో తెలుసా? 'క్రీస్ట్ ద రెడీమర్'.
బ్రెజిల్ పేరు చెబితే చాలు గుర్తొచ్చేంతలా ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఈ విగ్రహాన్ని ఇప్పుడు మరింత పటిష్టంగా తీర్చిదిద్దుతున్నారు. అక్కడి వాతావరణానికి సరిపోయే పదార్థాలతో దానికి కోటింగ్ వేస్తున్నారు. ఆ మధ్య ఓ పెద్ద తుపాను బ్రెజిల్‌ని వూపేసింది. ఎన్నో చెట్లు, భవనాలు నేలకూలాయి. అంతటి తుపాను ధాటికి కూడా ఈ విగ్రహం చెక్కచెదరలేదు. ఎందుకంటే దాని పైపూతలకు వాడిన సోప్‌స్టోన్ పదార్థం మెరుపులు, పిడుగుల నుంచి రక్షణ కల్పించిందట. అయితే ఆ భారీ వర్షాల వల్ల అక్కడక్కడ కొద్దిగా పెచ్చులూడింది. అందుకే ఇప్పుడీ ముస్తాబు.
బ్రెజిల్‌లో ఒక భారీ క్రీస్తు విగ్రహాన్ని నిర్మించాలనే ఆలోచన 1850 నాటిది. కానీ అప్పటి యువరాణి ఇసాబెల్ పెద్దగా ఆసక్తి చూపలేదు. తిరిగి 1921లో ప్రయత్నాలు మొదలయ్యాయి. ఎన్నో నమూనాలు పరిశీలించి, చివరికి చేతులు చాపినట్టు ఉన్న నమూనానే ఎంచుకున్నారు. ఎందుకంటే దేవుడికి అందరి పట్లా అంత ప్రేమ ఉంటుందని చెప్పడానికి. ఆపై ప్రజల నుంచి విరాళాలు సేకరించి నిర్మాణం ప్రారంభించారు. తొమ్మిదేళ్ల పాటు శ్రమించి 1931లో పూర్తిచేశారు. ఈ విగ్రహం బరువెంతో తెలుసా? 700 టన్నులు. అప్పట్లో దీని నిర్మాణానికి 11 కోట్ల రూపాయలపైనే అయ్యింది. ఇది 2007 జులై 7న ప్రకటించిన ఏడు కొత్త వింతల్లో చోటు దక్కించుకుంది.
- ================================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...