Thursday, April 22, 2010

ఎడారులు ఏర్పడేదెలా? , Deserets are formed-How?







ప్రశ్న:
ఎడారులు ఎలా ఏర్పడుతాయి?

జవాబు:
ఎడారుల్లో అనేక రకాలున్నాయి. పూర్తిగా ఇసుకతో నిండి ఉండేవాటితో పాటు, బల్లపరుపుగా ఉండే రాతి నేలలు, అత్యంత వేడిగా ఉండేవి, చాలా చల్లగా ఉండే ఎడారులు కూడా ఉన్నాయి. ఎడారుల్లో వర్షపాతం అత్యల్పంగా ఉంటుంది. ఇవి నివాసయోగ్యం కాని నిర్జన ప్రదేశాలు.

ఎడారులు ఏర్పడడానికి కారణం అనేకం. భూమిపై గాలి ఒకే దిశలో ఎక్కువ దూరం పయనిస్తే, ఉష్ణం వల్ల ఆ గాలిలోని తేమ ఆవిరై, రాన్రాను ఆ గాలి పొడిగా మారుతుంది. ఈ పొడిగాలులు వీచినంత మేర భూమిపై ఉండే తేమ కూడా ఆవిరైపోతుంది. అలా ఆ భూభాగం ఎండిపోవడం ఆరంభిస్తుంది. తడిలేక పోవడంతో ఆ ప్రదేశంలోని మొక్కలు, చెట్లు ఎండిపోయి నేల సారం కోల్పోతుంది. క్రమేణా ఆ ప్రాంతం ఎడారిగా మారుతుంది. ఎడారులు చాలా వరకూ భూమధ్య రేఖకు దగ్గరగా ఉంటాయి. దీనికి కారణం ఆ ప్రాంతంలో వేడి అధికంగా ఉండడంతో నేలలో ఏమాత్రం తడి ఉండకపోవడం. భూమధ్య రేఖకు దూరంగా ఉన్నా, సముద్రాలకూ భూభాగానికీ మధ్య అనేక పర్వత శ్రేణులుంటే, తేమగాలులు ఆ పర్వతాలను దాటి అవతలి వైపు వెళ్లకపోవడం వల్ల ఇటువైపే వర్షాలు కురిసి, ఆవలి వైపు ఎడారిగా మారే పరిస్థితులు ఏర్పడుతాయి. ఈ పరిస్థితులున్న ప్రదేశాల్లో శిలలు నిత్యం గాలుల తాకిడికి అరుగుదలకు లోనవుతూ, రాన్రానూ విచ్ఛిన్నమవుతూ వివిధ పదార్థాలుగా విడిపోతాయి. వాతావరణంలో అప్రయత్నంగా కురిసే యాసిడ్‌ వర్షాల వంటి రసాయనిక సంఘటనల వల్ల ఆ శిలాభాగాలు ఖనిజాలుగా, అల్యూమినియం ఐరన్‌ ఆక్సైడ్‌లుగా, సిలికాన్‌లా మారిపోతాయి. వీటిలో కొన్ని భాగాలు కలిసి బంకమన్నుగా మారితే, మరికొన్ని ఇసుకగా మిగిలిపోతాయి. ఎడారుల్లో ఇసుక ఏర్పడేది శిలలు విచ్ఛిన్నమవడం వల్లనే.



courtesy : Eenadu News paper
  • ====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...