Monday, July 13, 2015

మిగతా జంతువులతో పోల్చితే కుక్కకు మాత్రమే విశ్వాసం అనే గుణం ఎలా వచ్చింది.

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...




ప్రశ్న: మిగతా జంతువులతో పోల్చితే కుక్కకు మాత్రమే విశ్వాసం అనే గుణం ఎలా వచ్చింది.

జవాబు: కుక్కలు, పిల్లులు, గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలు, గుర్రాలు, ఒంటెలు, గాడిదలు మొదలైన క్షీరద జంతువులు మానవ సామాజిక జీవితంలో పెంపుడు జంతువులుగా ఉండనట్లయితే అవి లక్ష సంవత్సరాల క్రితమే అంతరించిపోయేవని జీవావరణ శాస్త్రజ్ఞులు రుజువు చేశారు. ఎందుకంటే వాటికి క్రూరమృగాల నుంచి, విపరీతమైన ప్రకృతి భీభత్సాలనుంచి ఆత్మ రక్షణ చేసుకోగల సత్తాలేదు. అంతేకాదు, కోళ్లు, బాతులు కూడా మానవుడు లేకుంటే ఇంతకాలం పాటు ఉండేవి కావని తెలుస్తోంది.

ఇలా మానవుడితో ప్రత్యక్షంగా (పెంపుడు), పరోక్షంగా (వీధి) శునకాలు భాగమయ్యాయి. కుక్కకు సహజ సిద్ధంగా చాలా సునిశితమైన ఘ్రాణశక్తి ఉంది. మనిషికున్న ఘ్రాణశక్తికన్నా కుక్కలకు కొన్ని వేల రెట్లు ఎక్కువ ఘ్రాణశక్తి ఉంది. అందువల్ల మనుషుల్ని వారి నుంచి విడుదలయ్యే విశిష్టమైన వాసనల ఆధారంగా గుర్తించగలుగుతాయి. అన్నం పెట్టే వారెవరో, పెట్టని పక్కింటి వారెవరో, ఎపుడూ చూడని ఆగంతకులెవరో వాసన ద్వారా ప్రధానంగా చూపులద్వారా కుక్కలు గుర్తించగలుగుతాయి. అలా వీటికి విశ్వాస గుణం అలవడింది.
కుక్కలకు నోరెక్కువ. గట్టిగా మొరగగలవు. కాబట్టి ఆగంతకులు వస్తే అరిచిగోల చేస్తాయి. ఇంటివారికి ఆ విధంగా సహకరించగలవు. అంతేకాకుండా ఇవి కరుస్తాయి. కుక్కలున్న ఇంటికి రావాలంటే దొంగలకు భయం. అందుకే మనుషులకు కుక్కలు మంచి పెంపుడు జంతువులయ్యాయి. మిగతా జీవులను పెంచుకున్నా అవి కుక్కల్లా విశ్వాసం చూపించలేవు.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌, కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)

 

No comments:

Post a Comment

your comment is important to improve this blog...